మూవీ రివ్యూ: ‘వైఫ్ ఆఫ్ రామ్’

Fri Jul 20 2018 22:37:45 GMT+0530 (IST)

చిత్రం : ‘వైఫ్ ఆఫ్ రామ్’
నటీనటులు: మంచు లక్ష్మి - సామ్రాట్ - ఆదర్శ్ బాలకృష్ణ - ప్రియదర్శి తదితరులు
సంగీతం: రఘు దీక్షిత్
ఛాయాగ్రహణం: సామల భాస్కర్
మాటలు: సందీప్ గంటా
నిర్మాతలు: మంచు లక్ష్మి - విశ్వ ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: విజయ్ యెలకంటినటిగా వైవిధ్యమైన పాత్రలు ప్రయత్నిస్తున్నా ఇప్పటిదాకా సరైన విజయం మాత్రం అందుకోలేకపోయింది మంచు లక్ష్మి. ఇప్పుడామె ‘వైఫ్ ఆఫ్ రామ్’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు విజయ్ యెలకంటి రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో ఆకట్టుకుంది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దీక్ష (మంచు లక్ష్మి) ఓ మధ్య తరగతి మహిళ. తన భర్తతో కలిసి సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. ఆమె భర్త రామ్ (సామ్రాట్ ను ఎవరో హత్య చేస్తారు. పైగా దీక్షకు మిస్ క్యారేజ్ అవుతుంది. భర్తను చంపిందెవరో తెలుసుకోవడానికి పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. దీంతో దీక్ష స్వయంగా తన భర్త కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో  ఆమెకు అనూహ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలేంటి.. ఇంతకీ రామ్ ను చంపిందెవరు.. దీని వెనుక ఎవరున్నారు.. చివరికి ఏం జరిగింది.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కథను తిన్నగా చెబితే ప్రేక్షకులకు ఏమంత ఆసక్తి ఉండదు. స్క్రీన్ ప్లేతో ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. నేరుగా వింటే మామూలుగా అనిపించే కథను అటు ఇటు చేసి ఆసక్తికర మలుపులతో చెప్పాలి. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్లకు ఈ లక్షణం చాలా అవసరం. ఈ విషయంలో ‘వైఫ్ ఆఫ్ రామ్’ దర్శకుడు విజయ్ యెలకంటి మంచి ప్రయత్నమే చేశాడు. అసలు కథను దాచి పెట్టి.. ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా కథను చెప్పడానికి అతను ఎంచుకున్న మార్గం బాగానే ఉంది. ఒక దశ వరకు సినిమా చూసి ఏదో అనుకునే ప్రేక్షకుడు.. చివర్లో అసలు విషయం తెలిసి షాకవుతాడు. థ్రిల్ ఫీలవుతాడు. కానీ ఈ ఒక్క విషయంలో మెప్పిస్తే సరిపోతుందా? ఈ ట్విస్ట్.. స్క్రీన్ ప్లేలో వైవిధ్యం వరకు ఓకే కానీ.. ఈ మలుపు దగ్గరికి వచ్చే వరకు ప్రేక్షకుడు ఎంగేజ్ కావాలి.. అతడిలో ఆద్యంతం ఆసక్తి రేకెత్తించాలి.. ముందు నుంచే ఉత్కంఠ రేగాలి.. అది అంతకంతకూ పెరుగుతూ పోవాలి కదా.. ‘వైఫ్ ఆఫ్ రామ్’లో ఇవే మిస్సయ్యాయి.

‘వైఫ్ ఆఫ్ రామ్’ కచ్చితంగా ఒక మంచి ప్రయత్నమే. పాటలు.. కామెడీ ట్రాకులు.. అనవసర సన్నివేశాలు ఏమీ లేకుండా ఒక కథను చెప్పే ప్రయత్నం జరిగింది. ఒక బర్నింగ్ ఇష్యూ నేపథ్యంలో ఈ థ్రిల్లర్ కథను రాసుకున్న దర్శకుడు.. ఈ కథను చెప్పడంలో సిన్సియారిటీ చూపించాడు. కానీ గంటా 50 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా.. చివరికొచ్చేసరికి ఓ రెగ్యులర్ లెంగ్త్ ఉన్న సినిమా చూసిన భావన కలిగించడమే పెద్ద ప్రతికూలత. థ్రిల్లర్ కథాంశాలకు కథనం వేగంగా సాగిపోవడం అత్యంత కీలకం. కానీ ఆ వేగం ఇందులో లేకపోయింది. ప్రథమార్ధంలో ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలు పెద్దగా లేవు. పోలీసులు పట్టించుకోని తన భర్త హత్య కేసును కథానాయికే ఛేదించడానికి సిద్ధపడుతుంది. ఆమె పరిశోదన నేపథ్యంలోనే ప్రథమార్ధమంతా సాగుతుంది. కానీ ఇందులో మరీ ఆసక్తి రేకెత్తించే.. ఉత్కంఠ కలిగించే అంశాలేమీ కనిపించవు.

తెరమీద కనిపించే పాత్రలు తక్కువ కావడంతో పెద్దగా సందడి ఉండదు. థ్రిల్లర్ మూవీ కావడంతో వేరే ఆకర్షణలకూ స్కోప్ లేదు. కేవలం ఆసక్తికర కథనంతోనే మెప్పించాల్సి ఉండగా.. ఆ విషయంలో దర్శకుడు మెప్పించలేకపోయాడు. సాధారణమైన సన్నివేశాలు బోర్ కొట్టించేస్తాయి. ద్వితీయార్ధంలో కథానాయికలోని మరో కోణాన్ని చూపిస్తూ.. ఆమె అసలు ఉద్దేశాల్ని వెల్లడించే దగ్గర్నుంచి ‘వైఫ్ ఆఫ్ రామ్’ సరైన ట్రాక్ లోనే సాగుతుంది. చివరి అరగంట సినిమాకు బలంగా నిలుస్తుంది. ఆ దశలో ప్రేక్షకుడు ఎంగేజ్ అయినా.. అంతకుముందు జరిగిన తంతును ఇదేమీ మరిపించలేదు. ప్రేక్షకుల్ని చివర్లో థ్రిల్ చేయడం గురించే దర్శకుడు ప్రధానంగా దృష్టిపెట్టినట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో మిగతా కథనం విషయంలో అంత జాగ్రత్త పడలేదు. కొన్ని సన్నివేశాల విషయంలో చివర్లో జస్టిఫికేషన్ ఉన్నప్పటికీ.. ముందు చూస్తే అవన్నీ చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే ‘వైఫ్ ఆఫ్ రామ్’ రొటీన్ కు భిన్నమైన ఒక మంచి ప్రయత్నమే కానీ.. ఒక థ్రిల్లర్లో ఉండాల్సిన బిగి ఇందులో మిస్సయింది. పూర్తి స్థాయిలో ఇది ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయలేకపోయింది.

నటీనటులు:

మంచు లక్ష్మి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసే ప్రయత్నం చేసింది. ఆమె నటనలో పరిణతి కనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే సటిల్ గా అనిపిస్తుంది ఆమె నటన. డైలాగ్ డెలివరీ విషయంలో కూడా జాగ్రత్త పడింది లక్ష్మి. దీని వల్ల పాత్రకు సహజత్వం వచ్చింది. సామ్రాట్ కు పెద్దగా రోల్ లేదు. ప్రియదర్శి సీరియస్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆదర్శ్ బాలకృష్ణ బాగా చేశాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:

గాయకుడు రఘు దీక్షిత్ సంగీత దర్శకుడిగా మారాడీ సినిమాతో. పాటల్లేని ఈ థ్రిల్లర్ మూవీకి నేపథ్య సంగీతమే కీలకం. ఈ విషయంలో రఘు జస్ట్ ఓకే అనిపించాడు. సామల భాస్కర్ ఛాయాగ్రహణం పర్వాలేదు. థ్రిల్లర్ ఫీల్ కలిగించేంత కెమెరా పనితనం కనిపించలేదు. నిర్మాణ విలువలు ఓకే. సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు విజయ్ ఎలకంటి రాసుకున్న పాయింట్ బాగుంది. ద్వితీయార్ధంలో.. ముఖ్యంగా చివరి అరగంటలో అతడి ప్రతిభ కనిపిస్తుంది. ఐతే క్లైమాక్స్ బాగా రాసుకున్నప్పటికీ.. దానికి ముందు కథనంలో ఏమంత విశేషం లేకపోయింది. తొలి గంటలో అసలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే అంశాలేమీ లేవు. దర్శకుడిగా విజయ్ కి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: వైఫ్ ఆఫ్ రామ్.. థ్రిల్ సరిపోలేదు

రేటింగ్ - 2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre