మన్మధుడికి అంత ధీమా ఎందుకబ్బా ?

Wed Jun 12 2019 10:44:54 GMT+0530 (IST)

రేపటి నుంచి ప్రభాస్ సాహో ఫీవర్ మొదలుకానుంది. టీజర్ తో హంగామా మొదలుపెట్టబోతున్నారు. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాక సాధారణ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి రేపుతున్న సాహో కంటెంట్ మీద రేపటి టీజర్ తో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తాయో ఎన్ని ఆన్ లైన్ రికార్డులు బద్దలు అవుతాయో ఊహకు అందటం లేదు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి నిన్న నాగార్జున మన్మధుడు 2 టీజర్ ని కూడా జూన్ 13నే రిలీజ్ చేస్తామని ప్రకటించడం మీడియా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇప్పటిదాకా కేవలం వర్కింగ్ స్టిల్స్ మాత్రమే వదులుతూ వచ్చిన టీం ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదలలేదు. అలాంటిది ఏకంగా టీజర్ అంటే ఇంత హటాత్ నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అనే డౌట్ వస్తోంది.  అందరూ సాహో మేనియాలో ఉంటారు కాబట్టి ఆ ఊపులో మన్మధుడు 2 టీజర్ కూడా వ్యూస్ తెచ్చుకుంటుందని ఓ వర్గం అంటుండగా మరో బ్యాచ్ వెర్షన్ ఇంకోలా ఉంది. ఆగస్ట్ 9నే మన్మధుడు 2 విడుదల చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నాడని వారం కన్నా తక్కువ గ్యాప్ లోనే సాహో వస్తున్నా లెక్కచేయకుండా సినిమా మీద నమ్మకంతో దాదాపు అదే  ఫిక్స్ అయ్యాడని చెబుతున్నారు.

ఒకవేళ ఇదే నిజమైతే రేపు టీజర్ వదలడం న్యాయమే కాని సరిగ్గా సాహో వచ్చే రోజున చేయడం మాత్రం కొన్ని అనుమానాలు రేపుతోంది. సాహో మీద ఎంత బజ్ ఉన్నా తనకొచ్చిన ఇబ్బందేమీ లేదన్నట్టు నాగ్ వ్యవహరిస్తున్న తీరు మీద ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ రావొచ్చు. లేదా టీజర్ తో పాటే డేట్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదు. చూద్దాం.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన మన్మధుడు 2లో రకుల్ ప్రీత్ సింగ్ హీరొయిన్ కాగా సమంతా కీర్తి సురేష్ స్పెషల్ క్యామియోలు చేస్తున్నారు