Begin typing your search above and press return to search.

నాగబాబు ఎందుకిలా మాట్లాడినట్లు?

By:  Tupaki Desk   |   10 Dec 2018 5:30 PM GMT
నాగబాబు ఎందుకిలా మాట్లాడినట్లు?
X
మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాడు. నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదంటూ ఇటీవలే ఆయన ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆల్రెడీ హాట్ టాపిక్ అవుతుండగా.. ఇప్పుడు ఆ వ్యాఖ్యల పై వివరణ అంటూ మరోసారి బాలయ్యను టార్గెట్ చేశాడు నాగబాబు. ఈసారి సీనియర్ కమెడియన్ బాలయ్యను లైన్లోకి తెచ్చి ఆ బాలయ్య గురించి తనకు తెలియదని చెప్పడం పొరబాటే అంటూ సెటైర్లు గుప్పించిన తీరు చర్చనీయాంశమవుతోంది. ఒక సారి బాలయ్య అభిమానుల్ని కవ్వించింది చాలదని.. నాగబాబు మళ్లీ ఇలాంటి వీడియోతో రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఐతే నాగబాబు మరీ ఇంత దూకుడుగా వ్యవహరించడం వెనుక వ్యూహం లేకపోలేదని స్పష్టమవుతోంది.

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తే మీడియా ఆయనకు అంతగా సపోర్టివ్వలేదన్న అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది. పైగా ఆయన గురించి దుష్ప్రచారం చేసి తొక్కేశారన్న అభిప్రాయం కూడా వారిలో ఉంది. ఐతే చిరు ఎంతైనా మెతక మనిషి. దూకుడుగా వ్యవహరించేవారు కాదు. అందువల్ల అప్పటి పరిస్థితుల్ని సరిగ్గా ఎదుర్కోలేక పోయారని.. ఇప్పుడు పవన్.. అతడి వర్గీయులు కూడా అలాగే ఉంటే మరోసారి వ్యతిరేక ప్రచారం జరుగుతుందన్న యోచన అతడి మద్దతుదారుల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రధానంగా తెలుగుదేశం కోసం పని చేస్తుందన్న విషయం గ్రహించిన పవన్ మద్దతుదారులు దూకుడుగా వ్యవహరించడం ద్వారా.. సోషల్ మీడియాను సరిగ్గా వాడుకోవడం ద్వారా ముందుకు సాగాలని డిసైడయ్యారు. యువతకు బాగా నచ్చేది కూడా దూకుడైన నాయకులే కాబట్టి.. ఆ రకమైన ఇమేజ్ కోసమే పవన్ ప్రయత్నిస్తున్నట్లుంది.

ఇటీవలి కాలంలో పవన్ స్వరం పెంచి.. ఆవేశంగా మాట్లాడ్డం వెనుక కూడా వ్యూహం అదే. ఇదే మైండ్ సెట్ జనసేన మద్దతుదారుల్లోనూ కనిపిస్తోంది. ఇలా సెన్సేషనల్ వేలో వెళ్తే తప్ప జనసేన ముద్ర వేయడం కష్టమన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో మీడియా అంతా అలెర్టయ్యి.. దాన్ని కవర్ చేయక తప్పలేదు. దీని మీద పెద్ద చర్చ నడుస్తోంది. ఈ వ్యాఖ్యల ద్వారా జనసేన దూకుడు ఎలా ఉండబోతోందో ఒక సంకేతాన్నివ్వాలనే యోచన కూడా ఉన్నట్లుంది. పవన్ ను.. జనసేన అభిమానుల్ని ఉద్దేశించి బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని దృష్టి ఉంచుకుని.. తాము ఏ స్థితిలోనూ తగ్గబోమని.. దీటుగా బదులిస్తామని ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపడానికి కూడా నాగబాబు ఇలా మాట్లాడినట్లు అర్థమవుతోంది.