Begin typing your search above and press return to search.

రాజమౌళి, మహేష్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

By:  Tupaki Desk   |   23 July 2015 11:18 PM GMT
రాజమౌళి, మహేష్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
X
రాజమౌళి సినిమా అనగానే ఆటోమేటిగ్గా టెక్నికల్ స్లాట్స్ కొన్ని ఫిక్సయిపోతాయి. సంగీతం కీరవాణి.. ఛాయాగ్రహణం సెంథిల్.. స్టైలింగ్ రమ.. ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు.. కథ విజయేంద్ర ప్రసాద్.. వీళ్లకు తప్ప వేరెవ్వరికీ బాధ్యతలివ్వడు జక్కన్న. మిగతా వాళ్ల విషయంలో అయినా రాజీ పడతాడేమో కానీ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి తప్ప వేరెవ్వరినీ ఊహించలేం. ఇప్పటిదాకా రాజమౌళి తీసిన పది సినిమాలకూ మారని టెక్నీషియన్ కీరవాణి మాత్రమే. బాహుబలి-2కు కూడా ఆయనే సంగీతాన్నందించబోతున్నాడు. ఐతే దీని తర్వాత జక్కన్న తీసే సినిమాలకు కీరవాణి పని చేస్తాడా లేదా అన్నదే సందేహం. కీరవాణికి, జక్కన్నకు ఏమైనా తేడా వచ్చిందేమో అని సందేహించకండి. 2016 డిసెంబరు 8 తర్వాత ఒక్క రాజమౌళి సినిమాకే కాదు.. ఇంకే సినిమాకూ పని చేయకూడదని ఫిక్సయ్యారు కీరవాణి.

పైన చెప్పుకున్న తేదీ నుంచి సంగీతం మానేస్తానని.. రిటైర్మెంట్ తీసుకుంటానని గత ఏడాది సంచలన ప్రకనట చేశాడు కీరవాణి. ఇప్పటిదాకా ఇలా తేదీ చెప్పి రిటైర్మెంట్ తీసుకున్న సంగీత దర్శకుడు భారత చలన చిత్ర పరిశ్రమలోనే లేడు. ఐతే 1989 డిసెంబరు 9న కీరవాణి సంగీత దర్శకుడిగా తన తొలి పాటను రికార్డు చేసిన కీరవాణి.. వచ్చే ఏడాది ఆ తేదీ నుంచి సంగీత దర్శకుడి అవతారం చాలిస్తానంటున్నాడు. దీనికి రాజమౌళి ఆమోద ముద్ర ఉందో లేదో? ఆ సమయం వచ్చేసరికి కీరవాణి నిర్ణయం మార్చుకుంటాడో లేదో? కానీ ఇప్పటికైతే మనం ఆ డేటుకు కీరవాణి రిటైర్మెంట్ అని ఫిక్సవ్వాల్సిందే. మరి కీరవాణి తన నిర్ణయం మీద పట్టుదలతో ఉంటే మాత్రం రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమాకు వేరే సంగీత దర్శకుడు పని చేయబోతున్నట్లే. మరి రాజమౌళితో పని చేసే ఆ మహద్భాగ్యం ఎవరికి దక్కుతుందో?