Begin typing your search above and press return to search.

కబాలి టు కాలా - తప్పెవరిది?

By:  Tupaki Desk   |   14 Jun 2018 12:08 PM GMT
కబాలి టు కాలా - తప్పెవరిది?
X
సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా తమిళనాట మినహా మిగిలిన అన్ని చోట్లా క్లైమాక్స్ కు చేరుకుంది. డివైడ్ టాక్ ఉంది కాబట్టి ఓ మూడు నాలుగు రోజుల తర్వాత ఏమైనా పుంజుకుంటుందేమో అన్న రజని ఫాన్స్ అంచనాలను పూర్తిగా నీరుగారుస్తూ కోలుకునే అవకాశం ఏ మాత్రం లేదని వసూళ్ల సాక్షిగా నిరూపిస్తునే ఉంది. దీనికి అందరూ దర్శకుడు రంజిత్ పానే నిందిస్తున్నారు. నిజానికి వాటికి అతను అర్హుడు కూడా. కారణం రజని ఏ దర్శకుడికి అంత ఈజీగా రెండో అవకాశం ఇవ్వడు. ఒక్క శంకర్ కు మాత్రమే శివాజీ తర్వాత రోబో ఇచ్చాడు. అతనూ తలైవా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు.

కానీ రంజిత్ పా కేసు వేరు. కబాలి ఫలితం గురించి నిద్రలో అడిగినా రజని ఫాన్స్ బాధ పడుతూ చెప్పుకుంటారు. అది మిగిల్చిన చేదు జ్ఞాపకాల గురించి. అలాంటిది కాలా కథను నమ్మి రజిని ఇచ్చిన బంగారం లాంటి రెండో అవకాశాన్ని రంజిత్ పా మరోసారి నేలపాలు చేసుకున్నాడు. సూపర్ స్టార్ తో కనీసం ఒక్క సినిమా చేయటమే కలగా ఉన్న దర్శకులు ఇప్పటికీ ఎందరో ఉన్నారు. అలాంటిది దెబ్బ తిన్న సినిమా ఇచ్చాక కూడా మరో ఆఫర్ ఇచ్చినందుకు రంజిత్ పా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. కానీ జరగలేదు. ఫలితం కాలా డిజాస్టర్.

తమిళనాడులో వసూళ్లు బాగానే ఉన్నాయిగా అనొచ్చు. కానీ సుదీర్ఘమైన థియేటర్ల సమ్మె తర్వాత స్టార్ హీరోల సినిమా ఒక్కటి కూడా అక్కడ విడుదల కాలేదు. కరువులో ఉన్న సినిమా ప్రేమికులకు కాలానే మహా ప్రసాదం అయ్యింది. దాంతో అంచనాలు అందుకులేకపోయినా కబాలి కంటే బెటర్ కదా అనే మానసిక సంతృప్తితో ఓసారి చూద్దామని ఓటు వేయటం వల్ల ఈ మాత్రమైనా ఆడుతోంది. అలా కాకుండా ఇంకెవరిదైనా గట్టి సినిమా పోటీగా వచ్చి ఉంటే కనక కాలా నడక అంత ఈజీగా ఉండేది కాదు. సామాజిక చైతన్యం పట్ల తనకున్న భావజాలాన్ని తన సినిమాల్లో చూపించే ప్రయత్నం చేసే రంజిత్ పా రజనీకాంత్ స్టేచర్ మర్చిపోయి అదే కబాలితో పాటు కాలాలో చూపించే ప్రయత్నం చేయటంతో అవి బెడిసి కొట్టాయి.

ఇప్పుడు రంజిత్ పాతో చేయాలంటే తమిళ స్టార్ హీరోలు ఆలోచించే పరిస్థితి. కథ ఎలా రాసుకున్నా తన ఫార్మాట్ లోనే తీసే అతనితో రిస్క్ చేయాలంటే ఆలోచిస్తున్నారు. కాలా సూపర్ హిట్ అయ్యుంటే ఈ సమీకరణాలు ఉండేవి కావు. బట్ కథ అడ్డం తిరిగింది. రంజిత్ పా నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎవరూ చేయకుండా ఉండకపోయే పరిస్థితి లేదు కానీ ఎవరు ముందుకు వస్తారా అనేది ఆసక్తికరం.రజని నెక్స్ట్ కూడా రిస్క్ లోనే చేస్తున్నాడు. టిపీకల్ సబ్జెక్టులను హ్యాండిల్ చేసే కార్తీక్ సుబ్బరాజ్ తో చేస్తున్న మూవీ ఎలా వస్తుందా అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో రేగడం సహజం. కుర్రాళ్ళయితే తనను బాగా డీల్ చేస్తారన్న అంచనా తప్పుతున్న నేపథ్యంలో రజనీకాంత్ ని కార్తీక్ సుబ్బరాజ్ ఎలా డీల్ చేస్తాడన్నది వేచి చూడాలి