Begin typing your search above and press return to search.

మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ఎవరు చేస్తే బాగుంటుంది ?

By:  Tupaki Desk   |   21 Sep 2019 1:30 AM GMT
మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ఎవరు చేస్తే బాగుంటుంది ?
X
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ బయోపిక్ ల హవా జోరుగా ఉంది. ఒకటిఅరా బయోపిక్ లు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన మాట వాస్తవమే కానీ దానికి కారణం జీవిత కథ చెప్పడంలో నిజాయితీ లోపించడం తప్ప మరొకటి కాదని విశ్లేషకుల అభిప్రాయం. అయితే అందరి కథలు బయోపిక్ తీసేందుకు అనువైనవి కాదని అంటారు. కారణం ఏంటంటే.. ఒక సినిమాకు కావాల్సిన సంఘర్షణ.. అవసరమైన ఎత్తుపల్లాలు కనుక హీరో పాత్ర జీవితంలో లేకపోతే అది ఉప్పు లేని పప్పులా.. మసాలా దట్టించని బిర్యానిలా.. అదోలా ఉంటుందనేది.. ఏదోలా అనిపిస్తుందనేది చాలామంది ఫిలిం మేకర్ల నిశ్చితాభిప్రాయం.

ఈ లాజిక్కులు.. బాక్స్ ఆఫీసు లెక్కలు పక్కన పెడితే రీసెంట్ గా తెలుగు ప్రేక్షకుల్లో తీవ్రంగా చర్చకు వచ్చిన అంశం మెగాస్టార్ చిరంజీవి బయోపిక్. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా 'గద్దలకొండ గణేష్'(వాల్మీకి) ప్రమోషన్స్ లో చిరంజీవి బయోపిక్ ప్రస్తావన రావడం.. వరుణ్ తడుముకోకుండా "చరణ్ అన్నయ్య కనుక చేయను అంటే నేను చిరు బయోపిక్ కు రెడీ" అని కామెంట్ చేయడంతో ఒక్కసారిగా చిరు బయోపిక్ చర్చనీయాంశం అయింది.

అయితే వరుణ్ ఈ కామెంట్ చేయడంతో "ఒకవేళ చిరు బయోపిక్ కు సన్నాహాలు జరిగితే.. ఆ సినిమాలో చిరంజీవి పాత్రకు వరుణ్ సూట్ అవుతాడా?" అన్న దిశగా కూడా చర్చలు జరిగాయి. దీనిపై భిన్నమైన అభిప్రాయాలు.. స్పందనలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు మేము ఒక పోల్ నిర్వహించాం. మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రముఖ హీరోలలో ఎవరు చిరు పాత్రకు సరిపోతారు అని ఐదుమంది మెగా హీరోల పేర్లను ఆప్షన్స్ గా ఇవ్వడం జరిగింది. వీటిలో అత్యధికంగా మా పాఠకులు ఓటు వేసింది మెగాస్టార్ తనయుడు.. వారసుడు రామ్ చరణ్ కు కావడం విశేషం.

పోల్ అయిన మొత్తం ఓట్లలో చరణ్ కు 43614 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 44.39%. చరణ్ తర్వాత సెకండ్ ఆప్షన్ గా అందరూ చిరంజీవి ముద్దుల మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను ఎంచుకుని ఎక్కువ ఓట్లు వేయడం గమనార్హం. తేజుకు ఈ పోల్ లో 31176 ఓట్లు పోలయ్యాయి. ఇది మొత్తం ఓట్లలో 31.73%. మిగతా మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరికీ పది శాతం ఓట్లు కూడా రాలేదు. దీన్ని బట్టి.. మొదటి ఛాయిస్ చరణ్. రెండో ఛాయిస్ సాయి ధరమ్ తేజ్. తేజు తన మేనమామ చిరుకు ఎ1 క్వాలిటీ జెరాక్స్ లా ఉంటాడు కాబట్టి సెకండ్ ప్లేస్ ఇచ్చారని మనం డిఫాల్ట్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ టాపిక్ తెరమీదకు రావడానికి కారణం అయిన వరుణ్ కు మాత్రం బయోపిక్ విషయంలో నిరాశ తప్పలేదు. ఎందుకంటే వరుణ్ కు తుపాకీ పాఠకులు వేసిన ఓట్లు 9603 అంటే 9.77%. దీన్ని బట్టి చూస్తే.. చిరు బయోపిక్ ను వరుణ్ చేసే విషయంలో ప్రేక్షకులు సానుకూలంగా లేరని అర్థం అవుతుంది.

తుపాకీ పోల్ లో మెగా హీరోలకు వచ్చిన ఓట్లను.. ఓట్ల శాతాన్ని ఒక్కసారి చూడండి.

రామ్ చరణ్:43614 (44.39%)

పవన్ కళ్యాణ్: 8019 (8.16%)

అల్లు అర్జున్: 5832 (5.94%)

సాయిధరమ్ తేజ్: 31176 (31.73%)

వరుణ్ తేజ్: 9603 (9.77%)