బోయపాటి తప్పించుకుంది అక్కడే

Sat Jan 19 2019 10:05:07 GMT+0530 (IST)

సాధారణంగా రామ్ చరణ్ సినిమాలు ఏవైనా సరే ఫైనల్ కాపీ వచ్చాక చిరంజీవి చూసి దానికి అవసరమైన మార్పులు చేర్పులు చెప్పడం సహజం. గతంలో అలా ఆయన చెప్పినవి హెల్ప్ అయ్యాయి కూడా. ఒక్క రంగస్థలం విషయంలో మాత్రం సుకుమార్ ని నమ్మి అలాగే ఉంచుదామనే అభ్యర్థన మీద చిరు తను సజెస్ట్ చేసిన మార్పులు కొన్ని డ్రాప్ అయ్యారట. లేకపోతే నిడివి తగ్గడంతో పాటు కొన్ని సన్నివేశాల మార్పు జరిగేదని ఆ టైంలోనే టాక్ వచ్చింది. కానీ చిరు ప్రమేయం వల్లే నాయక్-రచ్చ లాంటి రొటీన్ మాస్ సినిమాలు మంచి షేప్ తీసుకున్నాయని కూడా చెబుతారు.ఇదిలా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర విమర్శల పాలైన వినయ విధేయ రామను చిరుకి చూపకుండానే మేనేజ్ చేసారా అంటే మెగా కౌంపౌండ్ నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. సైరా వల్ల తీవ్ర ఒత్తిడిలో ఉండటంతో వివిఆర్ ఫైనల్ కట్ చూసే తీరిక లేకపోయిందట. బోయపాటి కాబట్టి నమ్మొచ్చులే అనే నమ్మకంతో చిరు లైట్ తీసుకోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. అయితే దీనికి బలం చేకూర్చేలా వినయ విధేయ రామ విడుదలైన రెండు రోజుల తర్వాత కుటుంబ సమేతంగా చిరు ప్రత్యేకంగా షో వేయించుకుని చూశారు. సాధారణంగా హిట్ అయినా ప్లాప్ అయినా అదే పనిగా చరణ్ సినిమాను చిరు రెండోసారి ఇలా పబ్లిక్ థియేటర్లో చూసిన దాఖలాలు లేవు. వివిఆర్ ను మాత్రమే చూసారు అంటే ప్రీ రిలీజ్ లో చూడలేదన్న క్లారిటీ వచ్చినట్టేగా. అక్కడే శీను చిరు గైడెన్స్ ని మిస్ అయ్యాడు.

ఇది అనుకోకుండా జరిగిందా లేదా మరొకటి ఏదైనా ఉందా అనేది పక్కన పెడితే చిరు నిజంగా చూసి ఉంటే ఇంత మితిమీరిన మసాలాలు వద్దనేవారని చెబుతున్నారు . షూటింగ్ స్పాట్ కు వచ్చి అప్పుడప్పుడు రషెస్ చూసినా దాని బట్టి టోటల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో ఊహించడం ఎవరికైనా అసాధ్యమే. అందుకే కేవలం ట్రైలర్ ని చూసే ప్రీ రిలీజ్ లో సినిమాను బోయపాటిని చిరు ఓ రేంజ్ లో పొగిడారన్న మాట. ఏదైతేనేం వినయ విధేయ రామ రామ్ చరణ్ చేయకూడని సినిమాగా అభిమానుల నుంచి సైతం విమర్శలు అందుకుంది. అందుకే యాభై కోట్ల వసూళ్లు వచ్చినా దాన్ని గర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదు