Begin typing your search above and press return to search.

పర్ఫెక్ట్ కాపీ గురించి దిల్ రాజు ఏమంటారో ?

By:  Tupaki Desk   |   22 April 2019 9:26 AM GMT
పర్ఫెక్ట్ కాపీ గురించి దిల్ రాజు ఏమంటారో ?
X
సృజనాత్మకతను రక్షించుకోవడానికి తక్కువ అవకాశాలు ఉన్న సినిమా పరిశ్రమలో కాపీ కొట్టడం అనేది చాలా మాములు విషయం. దానికి మనవాళ్ళు స్ఫూర్తి అని పేరు పెట్టుకుంటారు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా దాని తాలూకు అసలు ఛాయలు ఏ కొరియన్ మూవీలోనో ఇంగ్లీష్ సినిమాలోనో ఉండటం దాన్ని నెటిజెన్లు పసిగట్టి సోషల్ మీడియాలో పెట్టడం సాధారణం అయిపోయింది.

కాకపోతే కొందరు అసలు రచయితలు హక్కుల కోసం పోరాడి విజయం సాధిస్తారు మరికొందరు అంత స్థోమత లేక నీళ్లు వదులుకుంటారు. కానీ ముమ్ముడి శ్యామల దేవి అలా వదిలేయలేదు. న్యాయంగా పోరాడి తన హక్కులను సాధించుకున్నారు ఈవిడ 2010లో నా మనసు కోరింది నిన్నే అనే నవల రాశారు. అది పుస్తక రూపంలో విడుదలైంది కూడా. 2011లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ లో ఇందులో కథను సన్నివేశాలను వాడుకున్నారు.

అది రెండేళ్ళ తర్వాత టీవీలో ప్రసారమైనప్పుడే శ్యామల గుర్తించారు. కోర్టుకు వెళ్లారు. కొంత సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సిటీ సివిల్ కోర్ట్ కాపీ జరిగిన వాస్తవాన్ని నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులను ఆదేశించింది. శ్యామల గారు చెప్పిన ప్రకారం 30కు పైగా సన్నివేశాలు డైలాగులతో సహా కాపీ కొట్టారని చెబుతున్నారు. ఆ సమయంలో నిర్మాత దిల్ రాజుని కలిసే ప్రయత్నం చేసినా ఫలించలేదట.

పైగా 2009లోనే దర్శకుడు దశరధ్ ఇది రచయితల సంఘంలో రిజిస్టర్ చేసినట్టుగా చూపించే ప్రయత్నాలు చేశారని చెప్పారు. మొత్తానికి టైటిల్ లో ఉన్న పర్ఫెక్ట్ నెస్ మేకర్స్ లో కొరవడింది. దీని గురించి దిల్ రాజు ఇంకా స్పందించలేదు. దశరథ్ యాక్టివ్ గా సినిమాలు చేయడం మానేసి ఏళ్ళు అవుతోంది. మరి ఈ వివాదంలో కోర్ట్ తీర్పు వచ్చింది కాబట్టి శ్యామల గారికి ఎలాంటి పరిహారం దక్కుతుందో చూడాలి