Begin typing your search above and press return to search.

క‌ట్ట‌ప్ప చంపిన కార‌ణం వారికే తెలుసు:రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   10 Dec 2017 12:05 PM GMT
క‌ట్ట‌ప్ప చంపిన కార‌ణం వారికే తెలుసు:రాజ‌మౌళి
X
స‌హ‌జంగానే మ‌నిషికి ఆస‌క్తి గ‌ల విష‌యాల గురించిన స‌మాచారం తెలుసుకోవాల‌నే కుతూహ‌లం ఎక్కువ‌గా ఉంటుంది. అందులోనూ, ఒక విష‌యం గురించి సగం తెలిసిందంటే....దాని గురించి పూర్తి స‌మాచారం తెలుసుకునే వ‌ర‌కు నిద్ర పట్ట‌దు. త‌మ‌కు వ‌చ్చిన ధ‌ర్మ సందేహాల‌ను తీర్చుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకోవ‌డం స‌హజం. ఈ చిన్న లాజిక్ నే టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి విచ్చ‌ల‌విడిగా వాడారు. ఆ ఆస‌క్తితోనే ద‌ర్శ‌క ధీరుడు జ‌క్క‌న్న తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 చిత్రం కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులంద‌రూ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూశారు. బాహుబ‌లి మొద‌టి పార్ట్ లో జ‌క్క‌న్న సంధించిన సందేహాన్ని తీర్చుకునేందుకు వారంతా ఎంతో ఉత్సుక‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆ సినిమా విడుద‌ల‌య్యాక అస‌లు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఏ ప‌రిస్థితుల‌లో చంపాల్సి వ‌చ్చింద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిపోయింది. కానీ, ఆ సినిమా విడుద‌ల‌కు ముందు చిత్ర యూనిట్ లో కొంత‌మందికి మాత్ర‌మే ఆ కార‌ణం తెలుస‌ని రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా చెప్పారు.

సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ అంద‌రినీ ఓ ప్ర‌శ్న రెండున్న‌రేళ్ల పాటు వెంటాడింది. సినిమా విడుద‌ల‌య్యాక ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం తెలిశాక చాలామంది ప్ర‌శాంతంగా నిద్ర‌పోయారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే, అదే ప్ర‌శ్న చిత్ర యూనిట్ ను కూడా వెంటాడింద‌ట‌. అయితే, బాహుబ‌లి-1 కు - బాహుబ‌లి-2 కు మ‌ధ్య రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉంద‌ని, ఆ స‌మ‌యంలో కూడా చిత్ర యూనిట్ లో 15 మందికి మాత్ర‌మే అస‌లు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎలా - ఎందుకు చంపాడ‌న్న సంగ‌తి తెలుస‌ని జ‌క్క‌న్న చెప్పారు. ఆ మాట‌కొస్తే బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న‌ది ప్ర‌శ్న కాద‌ని, ఎలా చంపాడ‌న్న‌దే స‌రైన ప్ర‌శ్న అని అన్నారు. ప‌ది నుంచి ప‌దిహేను మంది కంటే ఎక్కువ స‌భ్యుల‌కు ఈ విష‌యం తెలీద‌న్నారు. షూటింగ్ సంద‌ర్భంగా వేర్వేరు స‌న్నివేశాల‌ను వేర్వేరు చోట్ల చిత్రీక‌రించ‌డంతో, ఎక్క‌డ ఏ స‌న్నివేశం ఎందుకు తీస్తున్నామో చాలామందికి అర్థం అయ్యేదికాద‌ని జ‌క్క‌న్న తెలిపారు.