విశ్వరూపం-2 రిలీజ్ డేట్ ఫిక్స్

Wed Jun 13 2018 13:55:27 GMT+0530 (IST)

ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి అనుకున్న దాని కంటే నాలుగేళ్లు ఆలస్యంగా రిలీజవుతున్నా కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నిలిచి ఉండటం అన్నది అరుదైన విషయం. కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం-2’ విషయంలో అదే జరిగింది. ఐదున్నరేళ్ల కిందట వచ్చిన ‘విశ్వరూపం’కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఆసక్తి ఏమాత్రం సన్నగిల్లలేదు. ఈ స్పై థ్రిల్లర్ కోసం కమల్ అభిమానులే కాక.. సామాన్య ప్రేక్షకులు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మొన్ననే ‘విశ్వరూపం-2’ ట్రైలర్ లాంచ్ చేశాడు కమల్. అంతే కాక ఈ చిత్ర విడుదల తేదీని కూడా ఆయన ప్రకటించారు. అనుకున్నట్లే ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.ఐతే ముందు అనుకున్నట్లు స్వాతంత్ర దినోత్సవం రోజే ఈ చిత్రాన్ని విడుదల చేయట్లేదు. ఐదు రోజుల ముందే.. అంటే ఆగస్టు 10న ‘విశ్వరూపం-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ స్వయంగా విడుదల తేదీని ప్రకటించాడు. ఆగస్టు 15 బుధవారం కాగా.. అంతకుముందు వారాంతంలోనే.. శుక్రవారం నాడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కమల్ నిర్ణయించాడు. 2013 సంక్రాంతి కానుకగా ‘విశ్వరూపం’ విడుదల కాగా.. అదే ఏడాది ‘విశ్వరూపం-2’ను రిలీజ్ చేయాలని కమల్ అనుకున్నాడు. తొలి భాగం తీస్తున్నపుడే రెండో భాగం చిత్రీకరణ కూడా చాలా వరకు పూర్తయింది. మిగతా షూటింగ్ అంతా కూడా త్వరగానే పూర్తి చేసినప్పటికీ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు డబ్బులు ఇవ్వకపోవడంతో కమల్ ఏమీ చేయలేకపోయాడు. ఐతే గత ఏడాది ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆయనే డబ్బులు పెట్టి మిగతా పనంతా పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు.