Begin typing your search above and press return to search.

నడిగర్ సంఘం ఎన్నికలు.. ట్విస్టిచ్చిన విశాల్..

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:59 AM GMT
నడిగర్ సంఘం ఎన్నికలు.. ట్విస్టిచ్చిన విశాల్..
X
అప్పటి వరకూ గుత్తాధిపత్యంతో సాగిన తమిళ సినీ కళాకారుల సంఘం (నడిగర్) ఎన్నికలను యువ హీరో విశాల్ మార్చేశాడు. తమిళ అగ్రనటుడు శరత్ కుమార్ సారథ్యంలో సీనియర్ నటీనటుల చెప్పు చేతుల్లో కునారిల్లిన సంఘానికి ఎదురొడ్డి విశాల్ టీం ఘనవిజయం సాధించింది. ఇన్నాళ్లు మూసధోరణితో వ్యవహరిస్తూ సినీ కళాకారులను పట్టించుకోని శరత్ కుమార్, సీనియర్ నటుల బృందాన్ని విశాల్ చిత్తుగా ఓడించాడు. విశాల్ నడిగర్ సంఘానికి ప్రధాన కార్యదర్శి కాగా.. అధ్యక్షుడిగా నాజర్ ను నియమించారు. ఈ నడిగర్ సంఘం ఎన్నికల వేళ తమిళ చిత్ర పరిశ్రమ మొత్తం రెండు వర్గాలుగా చీలిపోయింది. సీనియర్లంతా శరత్ కుమార్ వైపు.. జూనియర్ హీరోలంతా విశాల్ వైపు నిలబడ్డారు.. చివరకు ఎక్కువమంది సపోర్ట్ తో విశాల్ పంతం నెగ్గి విజయం సాధించాడు.

విశాల్ సారథ్యంలో నడిగర్ ప్యానల్ ఎన్నో మంచి పనులు చేపట్టింది. ఎంతో మంది పేద, వృద్ధ కళాకారులకు ఆర్థికసాయం చేసింది. ఫించన్లను అందజేసింది. అంతేకాదు.. సంఘం కోసం ఓ భారీ భవనం కూడా నిర్మాణం చేపట్టింది. సంవత్సరం కిందట మొదలు పెట్టిన ఈ భవన నిర్మాణం కోసం ఎన్నో కార్యక్రమాలను విశాల్ టీం చేపట్టింది. మరో 20 కోట్లు అవసరమని.. ఇందుకోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తాజాగా విశాల్ ప్రకటించారు. అందుకే నడిగర్ సంఘం ఎన్నికలను ఆరునెలల పాటు వాయిదా వేస్తున్నామని సంచలన ప్రకటన చేశారు.

ఇక నడిగర్ సంఘం పేరును ‘దక్షిణ భారత నటీనటుల సంఘం’ మార్చబోతున్నామనే వార్తలను విశాల్ ఖండించారు. అలాంటిదేమీ లేదని నడిగర్ సంఘంగానే ఉంటుందని తెలిపారు. చెన్నైలో అంతర్జాతీయ చిత్రోత్సవాలు నిర్వహించేలా సంఘం భవనాన్ని నిర్మిస్తున్నామని విశాల్ ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొంటామని సంఘం అధ్యక్షుడు నాజర్ స్పష్టం చేశారు.