Begin typing your search above and press return to search.

విశాల్.. నిర్మాతలకు దిమ్మదిరిగేలా ఇచ్చాడు

By:  Tupaki Desk   |   29 Aug 2016 11:30 AM GMT
విశాల్.. నిర్మాతలకు దిమ్మదిరిగేలా ఇచ్చాడు
X
ఆవేశంలో ఏదో నోరు జారడం.. ఆ తర్వాత తప్పయిపోయిందంటూ లెంపలేసుకోవడం.. లేదా మీడియా వాళ్లు నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు అని ఓ మాట అనేసి కవరింగుకి ప్రయత్నించడం.. ఇవన్నీ సెలబ్రెటీలకు అలవాటైన వ్యవహారాలే. ఐతే విశాల్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. బొండాలు తింటూ కూర్చునే నిర్మాతు పైరసీని ఏం అరికడతారంటూ కొన్ని రోజుల కిందట అతను తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తమిళ నిర్మాతలందరికీ మండిపోయింది. అర్జెంటుగా ఓ మీటింగ్ పెట్టి విశాల్ వ్యాఖ్యల్ని ఖండించడమే కాక.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ కూడా చేశారు. అతడికి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు.

ఐతే నిర్మాతల హెచ్చరికల్ని విశాల్ అస్సలు పట్టించుకోలేదు. సోమవారం విశాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి వేడుకలు జరుపుకున్న విశాల్.. మీడియాతో మాట్లాడుతూ నిర్మాతలపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పాడు. తాను ఏమీ తప్పు మాట్లాడలేదని.. కాబట్టి ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నాడు. నిర్మాతల మండలి ఏం చేసుకున్నా ఓకే అని.. చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించాడు. విశాల్ ఇంతకుముందు చేసిన వ్యాఖ్యల కంటే ఇప్పుడన్న మాటలకు నిర్మాతలకు మరింత దిమ్మదిరిగే ఉంటుంది. మరి క్షమాపణలు చెప్పకపోతే అతడి సినిమాలు విడుదల కాకుండా చర్యలు చేపడతామన్న నిర్మాతల మండలి ఇప్పుడేం చేస్తుందో చూడాలి.