శభాష్ అనిపించే మరో నిర్ణయం తీసుకున్న విశాల్

Tue Feb 12 2019 17:45:31 GMT+0530 (IST)

ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే సంఘంలో సినిమా పరిశ్రమ దీనికి అతీతం కాదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే పెద్ద గొప్పగా ఫీలయ్యే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అయితే పందెం కోడి విశాల్ మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నాడు. నడిగర్ సంఘం సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో సైతం కీలక భూమిక వహిస్తున్న విశాల్ ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరోవైపు వీటిని బాలన్స్ చేసుకుంటున్నాడు.నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించే దాకా పెళ్లి చేసుకోనని శపథం చేసిన విశాల్ అది పూర్తయ్యే దశకు రావడంతో హైదరాబాద్ అమ్మాయి అనీషాతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ నిధుల కోసం ఇళయరాజా 75 ప్రోగ్రాంను అంగరంగ వైభవంగా జరిపించిన విశాల్ దాన్ని గ్రాండ్ సక్సెస్ చేసి ప్రశంశలు అందుకున్నాడు. ఇప్పుడు అదే దారిలో మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.

ఇప్పుడు చేస్తున్న టెంపర్ రీమేక్ అయోగ్య పూర్తయ్యాక కల్ట్ డైరెక్టర్ గౌతం మీనన్ తో విశాల్ ఓ సినిమా చేయబోతున్నాడు. దాని మీద వచ్చే లాభాలన్నీ టిఎఫ్పిసి కోసం వాడబోతున్నాడట. ఒక్క రూపాయి తీసుకోకుండా దాని మీద వచ్చే డబ్బులన్నీ కౌన్సిల్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ సమాచారం. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుంది అనే దానికి కొంత టైం పట్టేలా ఉంది.

ప్రేమ ప్లస్ పోలీస్ కథలను అద్భుతంగా డీల్ చేసే గౌతం మీనన్ విశాల్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అనే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది. గౌతం ప్రస్తుతం విక్రం తో ధ్రువ నచ్చతిరం పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇది కాగానే విశాల్ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ రావొచ్చు. మిస్కిన్ తో డిఫెరెంట్ గా ట్రై  చేసి డిటెక్టివ్ లాంటి హిట్ కొట్టిన విశాల్ మరి గౌతంతో ఎలాంటి జానర్ చేయబోతున్నాడో వేచి చూడాలి