Begin typing your search above and press return to search.

విశాల్ ను ఎంత ఇరికిద్దామని చూసినా..

By:  Tupaki Desk   |   30 July 2015 4:07 PM GMT
విశాల్ ను ఎంత ఇరికిద్దామని చూసినా..
X
మన దగ్గర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా రసవత్తర డ్రామా నడిచింది. సామాన్య జనాలు కూడా ఆసక్తిగా ఈ ఎన్నికల్ని, దాని ఫలితాల్ని గమనించారు. చివరికి ఫలితం కూడా ఊహించని విధంగా వచ్చింది. ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమ లోనూ ఇలాంటి డ్రామానే నడుస్తోంది. ఇప్పటికే నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ నటీనటుల కోసం ఒరగబెట్టిందేమీ లేదని.. సంఘంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని.. మన తెలుగు వాడు విశాల్ విమర్శలు గుప్పించడంతో మొదలైన డ్రామా.. ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది.

శరత్ కుమార్ సవాలుకు దీటుగా స్పందించి ఎన్నికల్లో నిలుచుకున్నాడు విశాల్. నాజర్ లాంటి పెద్దలు అతడికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సి ఉండగా వివాదాల కారణంగా వాయిదా పడ్డాయి. త్వరలోనే ఎన్నికలు జరగబోతుండగా ఇరు వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. విశాల్ ఏదైనా పాయింట్ మీదే మాట్లాడుతుండటంతో శరత్ వర్గం బదులివ్వలేకపోతోంది. ఈ మధ్య పారవై మునియమ్మ అనే చిన్న ఆర్టిస్టు అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆమెను హాస్పిటల్లో చేర్పించి.. ఆర్థిక సాయం చేశాడు. దీనిపై శరత్ వర్గం మండిపడింది. ఇది ఎన్నికల స్టంటుని, ఓటు కోసమే ఇలా చేశాడని విమర్శించింది. ఐతే విశాల్ సింపుల్ గా వాళ్ల నోళ్లు మూయించాడు. మునియమ్మకు అసలు నడిగర్ సంఘంలో ఓటే లేదన్న విషయాన్ని వెల్లడించాడు. పబ్లిసిటీ గురించి పట్టించుకోకుండా విశాల్ ఆ పని చేస్తే.. దానిపై వివాదం రాజేయబోయి అతడికి కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది శరత్ వర్గం. విశాల్ ఏదైనా నిజాయితీగానే చేస్తున్నాడని, మాట్లాడుతున్నాడని కోలీవుడ్ జనాల్లో ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. కాబట్టి ఎన్నికల్లో శరత్ వర్గానికి షాక్ తగలొచ్చేమో అంటున్నారు అక్కడి జనాలు.