డిటెక్టివ్ విశాల్.. ట్రైలర్ అదిరింది

Tue Sep 12 2017 10:26:11 GMT+0530 (IST)

తెలుగులో ఆ మధ్య ‘పిశాచి’ అనే సినిమా వచ్చింది గుర్తుందా? చాలా కొత్తగా అనిపించిన ఆ హార్రర్ థ్రిల్లర్ మూవీని రూపొందించిన దర్శకుడి పేరు.. మిస్కిన్. తమిళంలో చాలా వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు ఈ దర్శకుడు. పెద్దగా పేరు లేని హీరోలతో సినిమాలు చేసే మిస్కిన్.. తొలిసారిగా విశాల్ లాంటి స్టార్ హీరోతో ఓ సినిమా చేశాడు. అదే.. తుప్పారివాలన్. ఈ గురువారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన ట్రైలర్ టాక్ ఆఫ్ ద కోలీవుడ్ అవుతోంది. ఎప్పుడూ రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తుండే విశాల్.. ఈ సినిమా కోసం పూర్తి భిన్నమైన అవతారం ఎత్తాడు.విశాల్ ‘తుప్పారివాలన్’లో డిటెక్టివ్ పాత్ర పోషిస్తుండటం విశేషం. సీరియల్ హత్యల మిస్టరీని అతను ఛేదిస్తాడిందులో. అతడి గెటప్ కానీ.. పాత్ర తీరు తెన్నులు కానీ.. డైలాగులు కానీ కొత్తగా అనిపిస్తున్నాయి. సినిమాకు యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణలా ఉన్నాయి. ట్రైలర్ ఇంటెన్స్ గా ఉండి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ చిత్రంలో విశాల్ కు హీరోయినే లేకపోవడం విశేషం. ఆండ్రియా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. స్నేహ భర్త ప్రసన్న ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. ఐతే అందుకు కొంచెం ఆలస్యం కావచ్చు. విశాల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి అతను అతను సహ నిర్మాత.