Begin typing your search above and press return to search.

తగ్గనే తగ్గనంటున్న విశాల్

By:  Tupaki Desk   |   9 Oct 2015 1:30 PM GMT
తగ్గనే  తగ్గనంటున్న విశాల్
X
మన విశాల్ మహా మొండివాడండోయ్. వైరి వర్గం తమపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేసినా.. డైరెక్టర్లు, నిర్మాతల యూనియన్ల నుంచి రాజీ చర్చలు జరిగినా.. వైరి వర్గం నుంచి కూడా రాజీకి పీలర్లు వచ్చినా అస్సలు తగ్గట్లేదు విశాల్. ఈ నెల 18న జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ వర్గంతో తలపడ్డానికే రెడీ అవుతున్నాడు విశాల్. తాజాగా శింబు చేసిన అటాక్ మీద చాలా కూల్ గా స్పందించడమే కాదు.. ఎన్నికలు యథాప్రకారం జరుగుతాయని.. తమ వర్గం బరిలో ఉంటుందని.. ఎవరు మనసుకు నచ్చినట్లు వాళ్లు ఓటేయాలని పిలుపునిచ్చాడు విశాల్.

తాను నడిగర్ సంఘంలో చీలిక తెస్తున్నాననంటూ, నక్క జిత్తులు చేస్తున్నానని మొన్న శింబు చేసిన కామెంట్ల మీద విశాల్ మాట్లాడుతూ.. ‘‘నేను నడిగర్ సంఘంలో సభ్యుడిని. ఏదైనా తప్పు జరిగినపుడు అడిగే రైట్ నాకుంది. నేను ప్రెస్ మీట్లకు అభిమానుల్నేసుకుని వచ్చి నినాదాలు చేయించట్లేదు. ఓ సభ్యుడిగా సంఘంలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపడం నా హక్కు. మూడేళ్లుగా ఎన్నికల కోసం పోరాడుతున్నాం. ఈ కాలంలో దాదాపు 50 లెటర్లు రాశాను. సంఘంలోని అవకతవకల్ని ఎత్తి చూపాను. ఒక్కటంటే ఒక్కదానికి కూడా బదుల్లేదు. ఇప్పుడు ఎన్నికలు వద్దని రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు దర్శకులు, నిర్మాతల సంఘానికి ధన్యవాదాలు. కానీ మాకు ఎన్నికల నుంచి తప్పుకునే ఉద్దేశం లేదు. ఎన్నికలు జరిగి తీరుతాయి. మేం పోటీలో ఉంటాం. మాకు ఓటేయండి అని మేం అడగం. మీ ఆత్మప్రభోదానుసారం ఓటేయండి’’ అన్నాడు విశాల్.

ఇంతకీ శరత్ కుమార్ కి, విశాల్ వర్గానికి ఎక్కడ తేడా వచ్చిందంటే.. 2012లో రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక శరత్.. నడిగర్ సంఘం పాత భవనాన్ని కూలగొట్టించి షాపింగ్ కాంప్లెక్స్ కమ్ మల్టీప్లెక్స్ కట్టడానికి ఏకపక్షంగానిర్ణయం తీసుకున్నాడు. దీన్ని తప్పుబడుతూ కోర్టుకెళ్లినవాళ్ల మీద ఎదురుదాడికి దిగాడు. దీనిపై విశాల్, నాజర్ లాంటి వాళ్లు ప్రశ్నించినందుకు శరత్ వర్గం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక అప్పట్నుంచి విశాల్, నాజర్ కలిసి నడిగర్ సంఘంపై పోరాటం చేస్తున్నారు. అవతలి వర్గం మాటలు హద్దులు దాటేకొద్దీ వీళ్ల పట్టుదల పెరిగి.. చివరికి ఎన్నికల పోరుకు దారి తీసింది.