Begin typing your search above and press return to search.

2019లో విశాల్ ద‌ర్శ‌క‌త్వం

By:  Tupaki Desk   |   9 Nov 2018 7:09 AM GMT
2019లో విశాల్ ద‌ర్శ‌క‌త్వం
X
టాలీవుడ్ మీడియాతో హీరో విశాల్ ఇంట‌రాక్ట్ అయిన ప్ర‌తిసారీ అత‌డికి రెండు ప్ర‌శ్న‌లు కామ‌న్. ఒక‌టి వ‌ర‌ల‌క్ష్మిని పెళ్లాడేదెప్పుడు? రెండోది ద‌ర్శ‌క‌త్వం వ‌హించేది ఎప్పుడు? ఈ కామ‌న్ ప్ర‌శ్న‌ల‌కు అంతే కామ‌న్‌ గా ఆన్స‌ర్ చేయ‌డం తిరిగి త‌న ప‌నిలోకి తాను వెళ్లిపోవ‌డం రొటీన్‌. వ‌ర‌ల‌క్ష్మితో ప్రేమ‌లో ఉన్నార‌ట క‌దా? అంటే న‌వ్వేస్తూ త‌ను స్నేహితురాలు మాత్ర‌మేన‌ని చెప్పేవాడు. ఇదే విష‌యంపై `స‌ర్కార్` ప్ర‌మోష‌న్స్‌ లో వ‌ర‌ల‌క్ష్మి కూడా కుండ‌బ‌ద్ధ‌లు కొడుతూ కేవ‌లం స్నేహితులం మాత్ర‌మే - ప్రేమ‌ - పెళ్లి ఏదీ లేదు అని చెప్పేసింది. ఇటీవ‌లే పందెంకోడి 2 ప్ర‌మోష‌న్స్‌ లో విశాల్‌ ని వ‌ర‌ల‌క్ష్మితో పెళ్లి వ్య‌వ‌హారంతో పాటు, ఆ రెండో ప్ర‌శ్న కూడా మీడియా వాళ్లు అడిగారు. ద‌ర్శ‌క‌త్వం ఎప్పుడు? అని ప్ర‌శ్నిస్తే త‌ప్ప‌కుండా వ‌చ్చే ఏడాది ఉంటుంది. త్వ‌ర‌లోనే దానిపైనా అప్‌ డేట్ అందిస్తాన‌ని అన్నాడు.

విశాల్ చెప్పిన‌ట్టే ఆ అప్‌ డేట్ రానే వ‌చ్చింది. న‌ల్ల‌న‌య్య‌ ఓ ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో ద‌ర్శ‌కుడిగా ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇంత‌కాలం ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్‌నే ఎంచుకుని పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందించ‌నున్నాడ‌ట‌. ఇంత‌కీ విశాల్ ఎంచుకున్న కాన్సెప్టు ఏంటి? అంటే.. సంథింగ్ స్పెష‌ల్‌.. స‌ర్‌ ప్రైజ్‌ నిచ్చేదే. అత‌డు వీధికుక్క‌ల‌పై సినిమా తీస్తున్నాడ‌ట‌. వీధికుక్క‌లు - కుక్క పిల్ల‌లు ఎంతో స్వేచ్ఛ‌గా బ‌తుకుతాయి. వాటిని హింసించే ఓన‌ర్ అనేవాడే ఉండ‌డు. అందుకే అవి ఎంతో స్వేచ్ఛా విహారం చేస్తూ హాయిగా బ‌తికేస్తాయి.. ఇళ్ల‌లో పెంచుకునే కుక్క‌ల‌తో పోలిస్తే బెట‌ర్ లైఫ్‌! అనేది అత‌డి కాన్సెప్టు. విన‌డానికే బోలెడంత ఫ‌న్నీగా ఉన్న ఈ పాయింట్‌ ని 2.30 గంట‌ల సినిమాగా విశాల్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి.

``మూడేళ్లుగా నా మైండ్‌ లో క‌థ మెదులుతూనే ఉంది. ఇప్ప‌టికి స్క్రిప్టు తుది మెరుగుల్లో ఉంది. ఇది పూర్తిగా జంతువుల‌పై తీస్తున్న సినిమా. హాలీవుడ్‌ లో ఇదివ‌ర‌కూ వ‌చ్చిన త‌ర‌హానే. 2019 జ‌న‌వ‌రిలో ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభిస్తాం. ఆ త‌ర్వాత జంతువుల‌కు ట్రైనింగ్ ఉంటుంది. ఇత‌ర‌త్రా కాస్టింగ్‌ ని ఎంపిక చేసుకుంటాం. ఆగ‌స్టులో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంది`` అని విశాల్ తెలిపారు. ఆరంభం యాక్ష‌న్ కింగ్ అర్జున్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాడు విశాల్. తాను ద‌ర్శ‌కుడ‌వ్వాల‌ని అనుకుంటే - అర్జున్ స‌ల‌హా మేర‌కు అత‌డిని నిర్మాత కం బ్ర‌ద‌ర్ విక్ర‌మ్ కృష్ణ హీరోని చేశారు. అలా పందెంకోడి చిత్రంతో బ‌రిలో దిగి హీరోగా అంచెలంచెలుగా ఎదిగేశాడు. మ‌ళ్లీ ఇన్నాళ్టికి మూలాల్లోకి వెళ్లి త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేస్తున్నాడు విశాల్.