గెట్ రెడీ.. అభిమన్యుడు-2 వస్తోంది

Tue Jun 12 2018 15:59:07 GMT+0530 (IST)

‘పందెం కోడి’ తర్వాత తెలుగులో విశాల్ కు సరైన విజయమే దక్కలేదు. అతను కొన్ని మంచి సినిమాలతో పలకరించినప్పటికీ రకరకాల కారణాల వల్ల వాటికి ఆశించిన వసూళ్లు రాలేదు. ఐతే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. మళ్లీ తెలుగులో మంచి విజయాన్నందుకున్నాడు విశాల్.  తమిళంలో విజయవంతమైన ‘ఇరుంబుతిరై’ ఇక్కడ ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలై పెద్ద హిట్టయింది. రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విశాల్ కు తెలుగులో అతి పెద్ద హిట్టుగా నిలిచింది. మంచి టైమింగ్.. చక్కగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం దీనికి కలిసొచ్చింది. చక్కటి ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్ తర్వాత బలంగా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు వస్తున్నాయి. అటు తమిళంలో కూడా విశాల్ కు ఇది అతి పెద్ద హిట్టుగా నిలిచింది.ఈ ఉత్సాహంలో ‘అభిమన్యుడు’కు సీక్వెల్ అనౌన్స్ చేశాడు విశాల్. ఈ చిత్ర దర్శకుడు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలోనే ‘అభిమన్యుడు-2’ చేస్తానని విశాఖపట్నంలో జరిగిన సక్సెస్ మీట్లో విశాల్ వెల్లడించాడు. ప్రస్తుతం మిత్రన్ స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్లు చెప్పాడు. అంతకుమించి వివరాలేమీ చెప్పలేదు విశాల్. డిజిటల్ ఇండియా గురించి మోడీ సర్కారు గొప్పలు పోతుండగా.. దాని వల్ల తలెత్తుతున్న దుష్పరిణామాలను ఆలోచనాత్మక రీతిలో ఈ సినిమా చూపించారు. ముఖ్యంగా మొబైళ్లలో వ్యక్తిగత సమాచారం షేర్ చేయడం ఎంత ప్రమాదమో ఇందులో చూపించిన విధానం అందరిలో ఒక భయం పుట్టించింది. ప్రేక్షకులు చాలా ఈజీగా కనెక్టయ్యే కథాంశం కావడం.. చాలా ఆసక్తికరంగా సినిమా సాగడంతో రెండు భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. విశాల్ త్వరలోనే ‘పందెంకోడి’ సీక్వెల్ తో పలకరించబోతుండటం విశేషం. దాని తర్వాత ‘టెంపర్’ రీమేక్ చేసి.. ఆపై ‘అభిమన్యుడు-2’లో నటించబోతున్నాడతను.