Begin typing your search above and press return to search.

అరవ హీరోకి గోల్డెన్ ఛాన్స్

By:  Tupaki Desk   |   26 May 2016 1:30 PM GMT
అరవ హీరోకి గోల్డెన్ ఛాన్స్
X
ముందు రచ్చ గెలిచి తర్వాత ఇంటికొచ్చాడు తెలుగవాడైన విశాల్. తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాక తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగే వచ్చింది. కానీ ఆ ఫాలోయింగ్ ను నిలబెట్టుకోవడం అతను ఫెయిలయ్యాడు. వరుసగా రొడ్డకొట్టుడు సినిమాలు చేసి మార్కెట్ మొత్తం చెడగొట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ మంచి సినిమాలు చేసినా ఫలితం లేకపోయింది. పల్నాడు.. ఇంద్రుడు.. జయసింహా.. ఇవన్నీ మంచి సినిమాలే అయినా తమిళంలో ఆడినట్లు తెలుగులో ఆడలేదు. విశాల్ లేటెస్ట్ హిట్ ‘కథకళి’ కూడా తెలుగులో నిలబడలేదు. పరీక్షల సీజన్లో ఈ సినిమాను రిలీజ్ చేయడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఐతే విశాల్ కొత్త సినిమా ‘రాయుడు’కు మాత్రం మంచి టైమింగ్ కుదిరింది.

తెలుగులో ఏ సినిమా పోటీ లేని టైంలో సోలోగా ‘రాయుడు’ రిలీజవుతోంది. ఈ సినిమాను వాస్తవానికి తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ 20న డేట్ ఫిక్స్ చేసుకోగా.. ‘బ్రహ్మోత్సవం’ వచ్చి పడింది. దీంతో తమిళంలో మాత్రమే రిలీజ్ చేసి.. తెలుగులో వారం లేటుగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకు ఇప్పటికే పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందా సినిమా. పక్కా మాస్ మసాలా కథాంశంతో తెరకెక్కిన ‘రాయుడు’ను తెలుగులో పెద్ద ఎత్తునే రిలీజ్ చేస్తున్నారు. పోటీ కూడా లేకపోవడంతో విశాల్ ఈ వారానికి ఫస్ట్ ఛాయిస్ మూవీ కాబోతోంది. విశాల్‌ కు ఇలాంటి అవకాశం చాన్నాళ్ల తర్వాత దక్కింది. మరి బాక్సాఫీస్‌ ను దున్నేసి తెలుగులో తిరిగి మార్కెట్ సంపాదిస్తాడేమో చూడాలి.