Begin typing your search above and press return to search.

3644 ఆర్టిస్టుల భ‌విష్య‌త్ తేల్చే ఎన్నిక‌లివి

By:  Tupaki Desk   |   23 Jun 2019 5:32 AM GMT
3644 ఆర్టిస్టుల భ‌విష్య‌త్ తేల్చే ఎన్నిక‌లివి
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగాయో తెలిసిందే. ర‌క‌ర‌కాల వివాదాల న‌డుమ చివ‌రికి గ‌త అధ్య‌క్షుడు శివాజీ రాజా పై సీనియ‌ర్ న‌రేష్ గెలుపొంది అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టారు. ఒక‌సారి నెగ్గి ప‌ని చేసినా వివాదాలు తెచ్చిన మ‌చ్చ‌తో శివాజీ రాజా ఓడిపోవ‌డం సంచ‌ల‌న‌మైంది. సేమ్ టే సేమ్ రిజ‌ల్ట్ న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌ల్లోనూ రిపీట్ కానుందా? అంటే అవున‌నే ప్ర‌చారం హోరెత్తుతోంది. తెలుగు వాడైన విశాల్ స్థానిక‌త‌ను ప్ర‌శ్నిస్తూ ప్ర‌త్య‌ర్థి బృందంలోని భాగ్య‌రాజా ప్ర‌చారం చేస్తుండ‌డం ప్ర‌తికూలంగా మార‌నుంద‌ని చెబుతున్నారు. న‌డిగ‌ర్ సంఘం సొంత భ‌వంతి నిర్మాణం కాక‌పోవ‌డాన్ని వేలెత్తి చూపిస్తున్నారు.

అయితే ఇటీవ‌లే ఎన్నిక‌ల్ని ఆపేయాల‌ని భాగ్య‌రాజా బృందం చేసిన ప్ర‌య‌త్నాన్ని విశాల్ కోర్టులో పోరాడి స‌మ‌ర్థంగా తిప్పి క‌ట్టాడు. య‌థాత‌థంగా నేడు (ఆదివారం) న‌డిగ‌ర సంఘం ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే రెండు కండీష‌న్ల ప్ర‌కారం ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోర్టు కోరిన సంగ‌తి తెలిసిందే. ఒక‌టి ఎల‌క్ష‌న్ అయిన వెంట‌నే ఫ‌లితాన్ని వెల్ల‌డించ‌కూడ‌దు.. రెండోది ఎన్నిక‌లు జ‌రిపే ప్లేసు మారాలి. ఆ ప్ర‌కార‌మే న‌డిగ‌ర్ పోలింగ్ నేటి ఉద‌య‌మే మొద‌లైంది. ఎన్నిక‌లు జ‌రుగుతున్న స్పాట్ కి విచ్చేసిన విశాల్ త‌మిళ మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని ముచ్చ‌టించారు.

విశాల్ మాట్లాడుతూ.. ఎన్నిక‌లు ప్రజాస్వామ్య బద్ధంగా జ‌ర‌గాలి. నటీనటుల సంక్షేమం కోసం జరుగుతున్న ఈ ఎల‌క్ష‌న్ ఎంతో కీల‌క‌మైన‌ది. నా మ‌ద్ధ‌తుదారులు ప్ర‌స్తుతం ప్ర‌త్య‌ర్థి ప్యానెల్ కి స‌పోర్ట్ చేస్తున్న మాట నిజ‌మే. అయితే ప్ర‌జాస్వామ్యంలో ఆ హ‌క్కు అంద‌రికీ ఉంటుంది.. అని అన్నారు. తాను త‌మిళుడు కాదు! అన్న ప్ర‌చారంపై అస్స‌లు స్పందించ‌న‌ని విశాల్ అన్నారు. ప‌డ్డ వారు చెడ్డ‌వారు కాదు. న‌న్ను అన్న‌వాళ్లే అది నిరూపించాలి అంటూ హుందాగా స్పందించారు విశాల్. 3644 మంది సభ్యులు గల దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నిక‌ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. నేటి సాయంత్రం 5 గంట‌ల‌కు పోలింగ్ పూర్త‌వుతుంది. ఈసారి ఎన్నిక‌ల్లో పాండ‌వ‌ర్ టీమ్ స్వామి శంక‌ర్ టీమ్ పోటీప‌డుతున్నాయి. పాండవర్ టీం నుంచి అధ్య‌క్ష ప‌ద‌వికి సీనియ‌ర్ నటుడు నాజర్.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విశాల్.. ట్రెజరర్‌ గా కార్తీ పోటీ చేస్తున్నారు. స్వామి శంకర్ దాస్ టీం నుంచి ద‌ర్శ‌క‌నటుడు భాగ్యరాజ్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. విశాల్‌ కి వ్యతిరేకంగా నటుడు ఇసిరి గణేష్.. ట్రెజరర్‌‌ గా నటుడు ప్రశాంత్ పోటీ చేస్తున్నారు. అంతిమంగా గెలుపు ఏ ప్యానెల్ ని వరిస్తుంది? అన్న‌ది స‌స్పెన్స్. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి త‌న‌పై వ‌చ్చిన నిందారోప‌ణ‌ల‌కు విశాల్ స‌మాధానం ఇస్తాడా లేదా? అన్న‌ది వేచి చూడాల్సిందే. పెద్ద తెర‌పై పందెంకోడిగా గెలిచిన విశాల్ తంబీల‌పై నెగ్గి రియ‌ల్ పందెంకోడి అనిపిస్తాడా? అన్న‌ది వేచి చూడాలి.