Begin typing your search above and press return to search.

విశాల్.. కొంచెం వెయిట్ చేయొచ్చుగా?

By:  Tupaki Desk   |   2 Sep 2015 9:45 AM GMT
విశాల్.. కొంచెం వెయిట్ చేయొచ్చుగా?
X
ఒకప్పుడు విశాల్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉండేది. తనకంటూ ఓ మార్కెట్ కూడా సృష్టించుకున్నాడు. ఆ మార్కెట్ చూసి తమిళంలో విడుదల చేసిన తేదీకే తెలుగులోనూ అతడి సినిమాలు రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని సినిమాలు ఒకేసారి తమిళం, తెలుగులో తెరకెక్కాయి. కానీ ఆ క్రేజ్, ఆ మార్కెట్ ఎంతో కాలం కొనసాగలేదు. వరుసగా విశాల్ చెత్త సినిమాలు వదిలి ఉన్న పేరంతా పోగొట్టుకున్నాడు. దీంతో అతడి సినిమాలు వచ్చి.. పోతున్న సంగతి కూడా ఎవరికీ తెలియడం లేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. క్రేజ్ ఉన్నపుడు అతను చెత్త సినిమాలు చేసినా ఎగబడి చూశారు. కానీ క్రేజ్ పోయాక మంచి సినిమాల్ని కూడా ఆదరించలేదు. నిజానికి పల్నాడు, ఇంద్రుడు చాలా మంచి సినిమాలు. కానీ అవి ఇక్కడ ఆడలేదు. అయినప్పటికీ విశాల్ దండయాత్ర ఆపలేదు.

తాజాగా ‘జయసూర్య’ సినిమాతో వస్తున్నాడు విశాల్. తమిళంలో ‘పాయుం పులి’ పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. కాజల్ కథానాయిక. నా పేరు శివ, ఇంద్రుడు ఫేమ్ సుశీంద్రన్ దర్శకత్వం వహించాడు. తమిళంలో ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఈ నెల 4న విడుదలవుతోంది. తెలుగులోనూ అదే రోజు విడుదల చేయబోతున్నారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తొలిసారి నిర్మాత అవతారమెత్తి ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం విశేషం. ఐతే ఇదే రోజు తెలుగులో భలే భలే మగాడివోయ్, డైనమైట్ సినిమాలు రిలీజవుతున్నాయి. వాటికి మంచి క్రేజే ఉంది. విడుదల కూడా భారీగానే ఉంది. మేజర్ థియేటర్లు బుక్ అయిపోయాయి. వీటితో పోటీ వల్ల విశాల్ సినిమాకు పెద్దగా థియేటర్లు దొరికే అవకాశం లేదు. పైగా ఆసక్తి రేపుతున్న రెండు తెలుగు సినిమాలుండగా.. తమిళ డబ్బింగ్ సినిమా మీద జనాలు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదీ సందేహమే. ఓ వారం ఆగి వచ్చి ఉంటే అప్పుడు పెద్దగా పోటీ ఉండేది కాదు. మరి ఈ శుక్రవారం విశాల్ సినిమా ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో చూడాలి.