అభిమన్యుడి పెళ్లి ముచ్చట

Tue Jun 12 2018 11:03:16 GMT+0530 (IST)

చాలా కాలం తర్వాత తెలుగులో అభిమన్యుడుతో నిఖార్సైన హిట్ కొట్టిన విశాల్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఆలస్యమైనా సరైన టైంలో విడుదల కావడంతో కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. తెలుగు మార్కెట్ ఏనాడో కోల్పోయిన విశాల్ దీనితో కోలుకున్నట్టే. పందెంకోడితో వచ్చిన ఇమేజ్ తో ఆ తర్వాత కొన్ని హిట్స్ కొట్టినప్పటికీ గత నాలుగేళ్లుగా విశాల్ గర్వంగా చెప్పుకునే సినిమా  టాలీవుడ్ లో ఒక్కటీ లేదు. మొత్తానికి అభిమన్యుడు పుణ్యమాని  విజయానందంలో మునిగి తేలుతున్న విశాల్ ప్రసుతం సక్సెస్ టూర్ పేరుతో విశాఖపట్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు విశాల్ ఆసక్తికరమైన సమాధానం చెప్పడం ఇప్పుడు అందరిని ఆలోచనలో పడేసింది. విశాల్ ఐదేళ్ల క్రితమే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అప్పట్లోనే చాలా వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టు ఇద్దరు క్లోజ్ గా ఉండటం పలు సందర్భాల్లో చెన్నై మీడియా హై లైట్ చేసి చూపించింది కూడా. కానీ ఆ తర్వాత ఎందులో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది. ఒక మేనేజర్ వల్ల విశాల్ వరలకు అపార్థాలు తలెత్తాయని ఇకపై నో ప్రేమ అని వరలక్ష్మి అన్నట్టుగా కథనాలు కూడా వచ్చాయి. కానీ అధికారికంగా ఇద్దరూ దీని గురించి ఎక్కడా మాట్లాడలేదు.విశాల్ ఇన్నాళ్లకు మళ్ళి ఓపెన్ అయ్యాడు. వరలక్ష్మి మంచి స్నేహితురాలు మాత్రమే అన్న విశాల్ తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్నట్టే మాట్లాడుతున్నాడు. తనకు చిన్నప్పటి నుంచి వరతో పరిచయముందని ఎప్పటికీ మంచి స్నేహితురాలిగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాకే తన పెళ్లి ఉంటుందని గతంలో  శపథం చేసిన విశాల్ ఆ టైంలో చేసుకునేది వరలక్ష్మిని కాదా అని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. విశాల్ కు శరత్ కుమార్ కు శత్రుత్వం ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ఆ కారణంగా ఏదైనా గ్యాప్ వచ్చిందా లేక పైన చెప్పుకున్నట్టు ఏదన్నా ఉందా అనేది మాత్రం సస్పెన్స్. ఒక్కటి మాత్రం నిజం. వరలక్ష్మికి విశాల్ కు పూర్తిగా తెగలేదు. స్నేహమైనా ఉండొచ్చు. ఎందుకంటే పందెం కోడి 2లో వరలక్ష్మి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఒకటి చేసింది. ఒకవేళ విశాల్ తో అపార్థం ఏదైనా ఉంటే సినిమా చేసేది కాదుగా. అక్టోబర్ లో విడుదల కానున్న పందెం కోడి 2లో కీర్తి సురేష్ హీరోయిన్. విశాల్ ఇప్పటికైతే క్లారిటీ ఇచ్చాడు కానీ ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.