టాలీవుడ్ కి విశాల్ లాంటోడు కావాలట

Thu Apr 20 2017 12:03:18 GMT+0530 (IST)

తెర మీద హీరోయిజం చూపించటం పెద్ద విషయం కాదు. కానీ.. రీల్ లైఫ్ మాదిరే.. రియల్ లైఫ్ లోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకునే సత్తా చాలామంది నటుల్లో ఉన్నట్లుగా కనిపించదు. సమాజంలోని లోటుపాట్ల గురించి కథలు.. కథలుగా సినిమాలు తీసే వారంతా.. తమ పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీద మాత్రం ఏ సినీ ప్రముఖుడు పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించరు. పెద్ద నిర్మాతల విషయాన్ని పక్కన పెట్టేస్తే.. చిన్న సినిమా.. చిన్న నిర్మాత ఈతి బాధల గురించి.. వారి కష్టాల గురించి పట్టించుకునే నాథుడే కనిపించడు. సమాజంలోని సకల దరిద్రాల మీద తమ సినిమాలతో సూటిగా ప్రశ్నించే సినీ మేధావి ప్రముఖులు.. తమ రంగంలోని సమస్యలపై ఎందుకు దృష్టి పెట్టరన్న ప్రశ్నను ఎవరూ పెద్దగా ప్రశ్నించరు.

అయితే.. ఇలాంటి పరిస్థితికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు తమిళ నటుడు విశాల్. ఈ మధ్యన తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన.. రావటం రావటంలోనే తనదైన ముద్రను ప్రదర్శిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కొన్ని నిర్ణయాలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి. శాటిలైట్ రైట్స్ వ్యవహారంలోనూ.. చిన్న.. పెద్ద సినిమాల విషయంలో చూపిస్తున్న తేడా విషయంపై ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ హాట్ చర్చగా మారుతోంది.

చిన్న సినిమాల రైట్స్ కొనుగోలు చేసేందుకు ముందుకు రాని టీవీ ఛానళ్లు..ఆ సినిమా సీన్లు.. పాటలు.. ట్రైలర్లను ఉచితంగా వాడేసుకోవటాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. చిన్న సినిమాలకు సంబంధించిన ఏ ఫీడ్ కూడా టీవీ ఛానళ్లకు ఫ్రీగా ఇవ్వొద్దని చెబుతున్నాడు. నిర్మాతలకు డబ్బు సమకూర్చేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పిన విశాల్.. సినిమా కంటెంట్ కారణంగా టీవీ ఛానళ్లకు భారీ ఆదాయం వస్తున్నప్పుడు.. అందులో కొంత మొత్తాన్ని నిర్మాతలకు ఇస్తే పోయేదేముందని ప్రశ్నిస్తున్నారు.

ఇదే కాదు.. ఆ మధ్యన తమిళనాట ప్రతి సినిమా టికెట్ పైనా ఒక రూపాయిని రైతులకు కేటాయించాలంటూ విశాల్ తీసుకున్న నిర్ణయంపై పలువురు నిర్మాతలు వ్యతిరేకించారు కూడా. తాము ఇప్పటికే నష్టాల్లో ఉంటే టికెట్ మీద రూపాయి చొప్పున రైతులు ఇవ్వమని చెప్పటం ఏమిటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే.. విశాల్ మాత్రం తన వాదనను సమర్థించుకుంటున్నారు. నిర్మాతల క్షేమంతో పాటు.. సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ.. తనదైన నిర్ణయాలు తీసుకుంటున్న విశాల్ లాంటి నటుడు టాలీవుడ్ కూడా అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలుగు సినిమా మొత్తం ఆ నలుగురి చేతిలో ఉందన్న విమర్శల నేపథ్యంలో.. విశాల్ లాంటోడు ఎంట్రీ ఇస్తే.. సీన్ మొత్తంగా మారే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ఆ నలుగురు.. విశాల్ లాంటోడ్ని అస్సలు రానిస్తారా? అన్నది అసలు ప్రశ్న.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/