Begin typing your search above and press return to search.

ఆ గొప్ప సినిమా తెలుగులోకి వ‌స్తోంది

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:30 PM GMT
ఆ గొప్ప సినిమా తెలుగులోకి వ‌స్తోంది
X
ఈ ఏడాది ఆరంభంలో ఓ త‌మిళ సినిమా గురించి దేశవ్యాప్తంగా చ‌ర్చ జ‌రిగింది. విడుద‌ల‌కు ముందే కొన్ని చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శిత‌మై అవార్డులు గెల‌వ‌డ‌మే కాదు.. గ‌త ఏడాది మ‌న దేశ జాతీయ అవార్డులూ సొంతం చేసుకున్న ఆ సినిమా పేరు ‘విసార‌ణై’. కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ నిర్మించిన ఈ సినిమాను అత‌డి మిత్రుడు వెట్రిమార‌న్ తెర‌కెక్కించాడు. విడుద‌ల‌కు ముందే అద్భుత‌మైన సినిమాగా పేరు తెచ్చుకున్న ‘విసార‌ణై’కి రిలీజ్ త‌ర్వాత కూడా గొప్ప ప్ర‌శంస‌లే ల‌భించాయి.

స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ సినిమా మీద ప్రశంసల జల్లు కురిపించారు. తాను ఇన్నేళ్లలో చూసిన సినిమాలన్నింట్లో ఇదే బెస్ట్ మూవీ అని కితాబిచ్చేశారంటేనే ఆ సినిమా గొప్పదనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కమల్ హాసన్ - ప్రియదర్శన్ - మణిరత్నం లాంటి లెజెండ్స్ అంతా కూడా ఈ సినిమాను గొప్పగా పొగిడారు. స‌గం వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నేప‌థ్యంలో సాగే ‘విసార‌ణై’ సినిమా ఇప్పుడు ‘విచార‌ణ’ పేరుతో తెలుగులోనూ విడుద‌ల కాబోతోంది.

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని తెలుగులోకి అందిస్తున్నారు. తెలుగ‌మ్మాయి ఆనంది.. మ‌రో తెలుగు న‌టుడు అజ‌య్ ఘోష్ ఇందులో కీల‌క పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించి పెద్ద విశేషం ఏంటంటే.. ఈ కథ రాసింది ఓ ఆటో డ్రైవర్. అతడి పేరు చంద్రకుమార్. త‌న జీవితంలో ఎదురైన భ‌యాక‌న అనుభ‌వాల నేప‌థ్యంలో అత‌ను రాసిన పుస్త‌కం ఆధారంగా వెట్రిమార‌న్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. అమాయ‌కులైన న‌లుగురు కుర్రాళ్ల‌ను పోలీసులు ఓ కేసులో ఇరికించి చిత్ర‌హింస‌లు పెట్టే నేప‌థ్యంలో క‌థ సాగుతుంది.