Begin typing your search above and press return to search.

ఆ సినిమా గుండెలు పిండేస్తోంది

By:  Tupaki Desk   |   7 Feb 2016 10:30 PM GMT
ఆ సినిమా గుండెలు పిండేస్తోంది
X
అనగనగా మధురైకి చెందిన ఓ ఆటోడ్రైవర్.. తన మిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడు. అక్కడ ఏదో ఓ దొంగతనం కేసు పెట్టి అతడితో పాటు ఇంకో ముగ్గురిని లాకప్ లోకి తోసేశారు పోలీసులు. ఆ తర్వాత వాళ్ల మీద మరిన్ని కేసులు పెట్టి ఇరికించారు. తర్వాత నేరం ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టారు. అమాయకులైన ఆ నలుగురికీ నరకం చూపించారు. చివరికి తమిళనాడు పోలీసులకు వీరి గురించి తెలిసి స్వస్థలానికి తీసుకెళ్లారు.

అత్యంత హృదయ విదారకమైన పరిస్థితిని ఎదుర్కొన్న ఆ ఆటోడ్రైవర్ ఈ అనుభవాలతో ఓ పుస్తకం రాశాడు. అది చదివిన దర్శకుడు వెట్రిమారన్ కదిలిపోయాడు. సినిమా తీయాలనుకున్నాడు. ధనుష్ అతడికి అండగా నిలిచాడు. సినిమా తీశారు. కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా ప్రదర్శించారు. అవార్డులు, రికార్డులు దక్కాయి. ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చిందా సినిమా. అదే.. విసారణై.

గత వారం రోజుల నుంచి కోలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. విడుదలకు నాలుగు రోజుల ముందే సినీ ప్రముఖులు, మీడియా వాళ్లకు స్పెషల్ షో వేయగా.. షో పూర్తయ్యే సమయానికి అందరి కళ్లలో నీళ్లే. మీడియా వాళ్లు అద్భుతమైన రివ్యూలతో ఈ సినిమాకు అండగా నిలిస్తే.. రజినీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం, ప్రియదర్శన్ లాంటి ప్రముఖులు సినిమా గురించి గొప్పగా మాట్లాడి సపోర్ట్ చేశారు. ఇప్పుడీ సినిమాకు తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తూ గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంటోందీ చిత్రం.