Begin typing your search above and press return to search.

వినాయక్ వెనక్కిచ్చేశాడా?

By:  Tupaki Desk   |   26 Nov 2015 10:27 AM GMT
వినాయక్ వెనక్కిచ్చేశాడా?
X
ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ప్రయాణం మొదలుపెట్టిన హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకురావడంలో వినాయక్‌ను మించిన వాళ్లు లేరనడానికి ఎన్టీఆర్, నితిన్ లాంటి వాళ్లే ఉదాహరణ. పెద్దగా బ్యాగ్రౌండ్ లేని బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాకు కూడా మంచి క్రేజ్ రావడానికి వినాయకే కారణం. అందుకే తన చిన్న కొడుకు అఖిల్ ను వినాయక్ చేతుల్లో పెట్టాడు నాగార్జున. కానీ వినాయక్ నమ్మకం నిలబెట్టలేకపోయాడు. ‘అఖిల్’ సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది. తన డ్యాన్సులు - ఫైట్లు - ఎనర్జీతో అఖిల్ మంచి మార్కులే వేయించుకున్నాడు కానీ.. కథాకథనాలు తీవ్రంగా నిరాశ పరచడంతో వినాయక్ కు చాలా చెడ్డ పేరొచ్చింది.

వినాయక్ కు వచ్చిన చెడ్డపేరు సంగతేమో కానీ.. ‘అఖిల్’ వల్ల బయ్యర్లు భారీగానే నష్టపోయారు. ఓ కొత్త హీరో సినిమా అయినా ‘అఖిల్’ మీద అంతేసి పెట్టుబడులు పెట్టడానికి వినాయకే కారణం అనడంలో సందేహం లేదు. ఇంతకుముందు వినాయక్ ను నమ్మి పెట్టుబడులు పెట్టినప్పుడు ఎప్పుడూ ఈ స్థాయిలో నష్టాలు రాలేదు. దీంతో బయ్యర్లు నిర్మాత నితిన్ తో పాటు వినాయక్ ను కూడా కలిసి మొరపెట్టుకున్నారు. బయ్యర్లను ఆదుకునేందుకు వినాయక్ తన వంతుగా పారితోషకంలో కొంత వెనక్కి ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే వినాయక్ ది చాలా పెద్ద మనసనే చెప్పాలి. ఇప్పటిదాకా హీరోలు రెమ్యూనరేషన్ లలో కొంత వెనక్కివ్వడం గురించే విన్నాం. ఇప్పుడు దర్శకులూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారన్నమాట.