విధేయ రాముడి వేడుకకు ఏర్పాట్లు

Thu Dec 06 2018 15:29:30 GMT+0530 (IST)

రామ్ చరణ్ - బోయపాటిల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. మరో వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుకుంటుంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ లో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గతంలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే ఆ విషయమై క్లారిటీ రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల మూడవ వారంలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.మిగిలి ఉన్న పాట చిత్రీకరణ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఫ్యామిలీ సాంగ్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా ట్రైలర్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈలోపు మరో పాటను కూడా బోయపాటి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దేవిశ్రీ స్వరపర్చిన ఒక మాస్ బీట్ సాంగ్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

సంక్రాంతికి ఈ చిత్రంను విడుదల చేయాలని ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నటించిన సినిమా అవ్వడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. బోయపాటి తనదైన స్టైల్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహా - ఆర్యన్ రాజేష్ తో పాటు ఇంకా పలువురు స్టార్స్ కూడా నటించారు. పక్కా ఫ్యామిలీ కమర్షియల్ మూవీ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ ను పూర్తిగా వినియోగించుకుని చరణ్ భారీ వసూళ్లను సాధిస్తాడా అనేది చూడాలి.