Begin typing your search above and press return to search.

నాటి సేతు నుంచి నేటి ఐ వరకూ... విక్రమ్

By:  Tupaki Desk   |   31 Aug 2016 4:18 AM GMT
నాటి సేతు నుంచి నేటి ఐ వరకూ... విక్రమ్
X
సినిమా నటుల్లో చాలా మంది నటిస్తే - మరి కొంతమంది జీవిస్తారు - ఇంకొంతమంది ఏకంగా నటనకోసం ప్రాణమే పెడతారు. అంటే.. ఆ స్థాయిలో వారి నటన ఉంటుంది. పాత్రకోసం ఎంత రిస్క్ అయినా చేయడం, ఏమాత్రం రాజీపడకుండా ప్రయత్నించడం వంటివి ఆ నటుడికి ఉండే లక్షణాలు. ఇలాంటి లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న నటుల్లో విక్రం ఒకరు. ఆయా సినిమాల్లోని పాత్రల కొసం ఈ నటుడు చేసే రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాల్లో రిస్క్ లు - వాటి పర్యవసానాలు - ఆ పనులు చేస్తున్నప్పుడు ఇంట్లోవాళ్ల రెస్పాన్స్ - ఆరోగ్య సమస్యలు మొదలైన వాటిపై తన కష్టాన్ని - ఇష్టాన్ని చెప్పాడు హీరో విక్రం.

అభిమానులు ముద్దుగా చియాన్ అని పిలుచుకునే ఈ విలక్షణ నటుడు "ఐ" సినిమా కోసం ఏస్థాయిలో కష్టపడ్డాడో, రిస్క్ చేశాడో డైరెక్టర్ శంకర్ స్వయంగా ఆడియో వేడుకలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నాటి "సేతు" సినిమా నుంచి నిన్నటి "ఐ" సినిమా వరకూ విక్రం తాను చేసిన రిస్క్స్ - బెస్ట్ అవుట్ పుట్ కోసం తాను పడిన కష్టాలను చెప్పాడు చియాన్. అప్పట్లో "సేతు" సినిమాకోసం సుమారు 15కేజీల బరువు తగ్గిన విక్రం దానికోసం రోజుకు కేవలం ఒక చపాతి - ఒక ఎగ్ వైట్ - బీట్ రూట్ లేదా క్యారెట్ జ్యూస్ మాత్రమే తీసుకునేవాడట. ఇదే సమయంలో షూటింగ్ లొకేషన్స్ లో ఏకంగా రోజుకు 16 కిలోమీటర్లు నడిచేవాడట.

ఇక "ఐ" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ముఖ్యంగా అందవిహీనంగా ఉన్న పాత్రకోసం ఏకంగా 25కేజీల బరువు తగ్గడం జరిగిందట. ఐ సినిమా విషయంలో విక్రం ఆరోగ్యంపై రకరకాల గాసిప్పులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మంటలంటే భయపడే విక్రం.. అపరిచితుడు సినిమాలో మంటల్లో ఫైట్ విషయంలోనూ - శివపుత్రుడు సినిమా ఫైట్ సీన్ లో గోరు ఊడిపోయినా కూడా ఆపకుండా చేయడం వంటి అనుభవాలను చెప్పారు. ఇక "రావణ్" సినిమా క్లైమాక్స్ కోసం బ్రిడ్జిపై నుంచి సుమారు మూడువేల మీటర్ల ఎత్తునుంచి కిందకు పడే సన్నివేశం చేసేటప్పుడు కూడా విక్రం కి తెగ భయం వేసిందట.. అయినా కూడా ఒక్కసారి "యాక్షన్" అనే అరుపు వినబడగానే విక్రంలో భయస్తుడు పోయి - నటుడు బయటకు వస్తాడట. ఈ విషయాలన్నీ విక్రం స్వయంగా చెప్పాడు.