హీరో ఎవరైనా... పబ్లిసిటీ కావాల్సిందే

Fri Feb 23 2018 05:00:01 GMT+0530 (IST)

సినిమాలో ఎంత టాప్ హీరో ఉన్నప్పటికీ... ఆ సినిమా గురించి సరైన పబ్లిసిటీ లేకపోతే... సినీజనాల్లో మూవీ చూడాలన్న కిక్కు ఎక్కదు. స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నారు కదా... సినిమాకు ఏ ఢోకా లేదు అనుకునే పరిస్థితి లేదిప్పుడు. అలా ధీమా పడితే... సినిమా చెట్టెక్కినట్టే. ఇలా ధీమాగా ఉన్న సినిమానే స్కెచ్. అతి త్వరలో విడుదల కాబోతోంది.విక్రమ్ కు తమిళ ప్రజల్లోనే కాదు... తెలుగు ప్రజల్లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. ఇక తమన్నా సంగతి చెప్పక్కర్లేదు. తెలుగులో టాప్ హీరోయిన్ రేంజికి వెళ్లాకే... తమిళ ఇండస్ట్రీ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా స్కెచ్. తమిళ డబ్బింగ్ మూవీ. ఎందుకోగానీ ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రచారం జరగడం లేదు. విక్రమ్ తమన్నాలకోసం థియేటర్లకు జనాలు వచ్చేస్తారన్న నమ్మకమో లేక... ఇంకే పెద్ద సినిమా విడుదలకు లేదన్న ధీమానో మరి. టీవీల్లో కూడా పెద్దగా ట్రైలర్లు కనిపించడం లేదు. కటౌట్లు - పోస్టర్లు కూడా అంతంత మాత్రంలా ఉన్నాయి. దీంతో సినీ జనాలు ఈ మూవీ గురించి పెద్దగా మాట్లాడడమే లేదు. మరి సినిమా లైన్లలో నిల్చుంటారో లేదో సందేహమే.

సినిమాలో విక్రమ్ ఉన్నా... తమన్నా ఉన్నా... పబ్లిసిటీ ఇవ్వందే పట్టించుకోరు సినీజనాలన్న సంగతి ఇప్పటికే ఆ చిత్రయూనిట్ అర్థం చేసుకుంటే మంచిది. స్కెచ్ గురించి గూగుల్లో వెతికే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నట్టు సమాచారం. ఎంతటి స్టార్లున్నా... తగిన ప్రచారం లేకపోతే... డోంట్ కేర్ అన్నట్టు ఉన్నారు మూవీ లవర్స్.