నాని సినిమా.. 24 స్టయిల్లో

Tue Apr 17 2018 12:54:50 GMT+0530 (IST)

నేచురల్ స్టార్ నానికి చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అతడి కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ ఫలితం తేడా వచ్చేసింది. వీకెండ్లోనే వీక్ అయిపోయిన ఈ సినిమా పరిస్థితి వీక్ డేస్ లోకి వచ్చేసరికి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ సినిమా బయ్యర్లకు పెద్ద ఎత్తునే నష్టాలు మిగిల్చేలా ఉంది. ఇన్నాళ్లూ రొటీన్ సినిమాలతోనే ఎలాగోలా లాక్కొచ్చేశాడు నాని. ఇకపై అతను కంటెంట్ లేని సినిమాలు చేస్తే కష్టమని తేలిపోయింది. ఆ విషయం నానికి కూడా బాగానే బోధపడ్డట్లుంది. అందుకే చర్చల్లో ఉన్న తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఏది ముందు చేయాల్సిన అవసరముందో అతను గుర్తించాడు.ప్రస్తుతం అక్కినేని నాగార్జున కాంబినేషన్లో నాని ఒక మల్టీస్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత నాని కోసం ఐదారు సినిమాలు కథా చర్చల దశలో ఉన్నాయి. అందులో ముందుగా విక్రమ్ కుమార్ సినిమానే ముందు చేయాలని నాని డిసైడయ్యాడట. విక్రమ్ ఏ సినిమా తీసినా అందులో కొత్తదనం ఉంటుంది. నాని కోసం కూడా ఓ వైవిధ్యమైన కథను రెడీ చేశాడట విక్రమ్. ఆ చిత్రం ‘24’ స్టయిల్లో కొత్తగా ఉంటుందని.. అదొక థ్రిల్లర్ మూవీ అని అంటున్నారు. నానికి ఈ చిత్రం చాలా భిన్నంగా ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ చిత్రానికి ఇంకా నిర్మాత ఖరారవ్వలేదు. ముందు స్క్రిప్టు ఓకే అయితే ఈ కాంబినేషన్లో సినిమాకు నిర్మాతను సెట్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. నానికి అవసరాల శ్రీనివాస్.. హను రాఘవపూడిలతో కూడా కమిట్మెంట్లు ఉన్నాయి.