Begin typing your search above and press return to search.

మన వెంకీకి విక్రమ్ డబ్బింగ్ చెప్పాడు

By:  Tupaki Desk   |   30 Aug 2016 11:30 AM GMT
మన వెంకీకి విక్రమ్ డబ్బింగ్ చెప్పాడు
X
తమిళ హీరో విక్రమ్ కెరీర్ ఆరంభంలో ఎంత స్ట్రగుల్ అయ్యాడో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే తెలుసు. అతను హీరోగా ముందు ప్రస్థానం ఆరంభించింది తెలుగులోనే. ఇక్కడ చాలా చిన్న స్థాయి సినిమాల్లో నటించాడతను. కెరీర్ ఆరంభమైన పదేళ్లకు కానీ అతడికి బ్రేక్ రాలేదు. ఆ టైంలో తమిళంలో చాలా సినిమాలకు విక్రమ్ డబ్బింగ్ చెప్పిన సంగతి చాలామందికి తెలియదు. మన విక్టరీ వెంకటేష్ కు సైతం అతను డబ్బింగ్ చెప్పాడట. ఇంకా తమిళంలో కొందరు హీరోలకు వాయిస్ ఇచ్చానని.. హీరోగా మంచి పేరు వచ్చాక కూడా డబ్బింగ్ ను వదిలిపెట్టలేదని.. తనకు డబ్బింగ్ అంటే అంతిష్టమని చెప్పాడు విక్రమ్.

‘‘తెలుగులో హీరోగా చేస్తూనే.. తమిళంలో డబ్బింగ్‌ చెప్పేవాడిని. ‘క్షణక్షణం’ సినిమాకు తమిళంలో వెంకటేష్‌ కు వాయిస్ ఇచ్చింది నేనే. ‘సత్య’ సినిమాలో జేడీ చక్రవర్తికి డబ్బింగ్ చెప్పాను. రెండూ రామ్‌ గోపాల్‌ వర్మ సినిమాలే. తమిళంలో ప్రభుదేవా.. వినీత్.. అబ్బాస్‌ లాంటి హీరోలకు డబ్బింగ్‌ చెప్పాను. నటనలో కంటే డబ్బింగులో నేను ‘ది బెస్ట్‌’ అని చెప్పగలను. ఆ విషయంలో చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. ‘ప్రేమికుడు’ సినిమాలో ప్రభుదేవాకు వాయిస్‌ ఇచ్చాను. ఆ సినిమాలో నటించకపోయినా డైరెక్టర్‌ శంకర్‌ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని మరిచిపోలేను. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ‘సేతు’ సినిమా నాకు బ్రేక్ ఇచ్చినప్పటికీ డబ్బింగ్ వదిలేయలేదు. వరుసగా మూడు సినిమాలు హిట్‌ అయ్యాక కూడా అబ్బాస్‌ కు డబ్బింగ్‌ చెప్పాను. అప్పటికి నేను అబ్బాస్‌ కంటే పెద్ద హీరోనే. కానీ డబ్బులు అవసరముండటం.. డబ్బింగ్ అంటే ఆసక్తి ఉండటంతో అలాగే కొన్నాళ్లు కంటిన్యూ చేశాను’’ అని విక్రమ్ చెప్పాడు.