రెహమాన్ సినిమాకూ విజయేంద్ర స్క్రీన్ ప్లే

Wed Sep 13 2017 12:14:02 GMT+0530 (IST)

విజయేంద్ర ప్రసాద్ ను కేవలం తెలుగు రచయితగా చూసే పరిస్థితి ఎప్పుడో పోయింది. ఓ వైపు ‘బాహుబలి’.. మరోవైపు ‘భజరంగి భాయిజాన్’ సినిమాలతో ఆయన నేషనల్ రైటర్ అయిపోయారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఆయన కథతో ‘మణికర్ణిక’ తెరకెక్కుతోంది. మరోవైపు తమిళంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మెర్సల్’కు స్క్రీన్ ప్లే అందించింది కూడా ఆయనే. త్వరలోనే ఆయన రెహమాన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు కూడా స్క్రీన్ ప్లే అందించే అవకాశాలున్నాయట. ఈ ఆఫర్ స్వయంగా రెహమానే తనకు ఇచ్చినట్లు చెప్పారు విజయేంద్ర. ఇతర భాషల్లో తాను పని చేస్తున్న సినిమాల గురించి విజయేంద్ర ఏమన్నారంటే..‘‘ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత నేపథ్యంలో ‘మణికర్ణిక’ కథ రాయమన్నప్పుడు క్రిష్ దర్శకుడైతేనే ఈ కథ రాస్తానని చెప్పాను. అప్పటికే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలైంది కాబట్టి నిర్మాతలు ఆనందంగా అంగీకరించారు. మేం చరిత్రను ఎక్కడా వక్రీకరించలేదు. ఇలాంటి చారిత్రక చిత్రాలను ప్రజల్లో చైతన్యం కలిగేలా తెరకెక్కించాలి. మేం అదే పని చేస్తున్నాం. ఈ సినిమాలో చాలా యాక్షన్ ఘట్టాలుంటాయి. మెర్సల్ చాలా వరకు పూర్తయింది. దీనికి స్క్రీన్ ప్లే అందించాను. అట్లీ దర్శకుడు. సినిమా పూర్తి కావచ్చింది. ఈ చిత్రానికి పని చేస్తుండగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ కూడా తాను తీయనున్న చిత్రానికి స్క్రీన్ ప్లే అందించమని కోరారు. ఇది మహదావకాశమే. కానీ నేనే ఇంకా ఏ మాటా చెప్పలేదు. నా దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ వల్లీ’ ఈ శుక్రవారం విడుదలవుతుంది. ఆ తర్వాత స్వీయ దర్శకత్వంలో ఇంకో రెండు సినిమాలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటి వివరాలు విజయదశమికి ప్రకటిస్తా. అందులో ఒకటి బాలీవుడ్ లో తీస్తా’’ అని విజయేంద్ర అన్నారు.