చైనా గ్రేట్ వాల్ పై తంబీల దాడి

Sat Aug 11 2018 11:25:08 GMT+0530 (IST)

లోకల్ మార్కెట్ పాత మాట! ఇంటర్నేషనల్ మార్కెట్ చేజిక్కించుకోవడం అన్నది కొత్త పంథా. దేశవిదేశాల్లో బాహుబలి సిరీస్ - దంగల్ - సీక్రెట్ సూపర్ స్టార్ సాధించిన విజయాలు ఈ కొత్తదారిని అలవాటు చేశాయి. విదేశాల్లో వందల కోట్లు వసూలు చేస్తుంటే ఎవరికైనా చేదా?  వెళ్లి దండుకోవాలన్న ఆశ ఉండదా? ప‌్రస్తుతం తంబీలు అదే బాటపట్టారు.మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చూపిన దారిలో అదే తరహాలో చైనా మార్కెట్ ని ఒడిసిపట్టుకోవాలన్న కసి ఇతరుల్లోనూ అంతకంతకు పెరుగుతోంది. ఆ ఆలోచనతోనే ఇండియాలోని బిగ్ బడ్జెట్ ఫర్మ్స్ అన్నీ రగిలిపోతున్నాయి. భారీ బడ్జెట్లతో - యూనివర్శల్ కథాంశాలతో సినిమాలు నిర్మించి విదేశీ మార్కెట్ లను గుప్పిట పట్టే ఆలోచనతో రాజీకి రాని ప్రణాళికల్ని రూపొందిస్తున్నాయి. అమీర్ ఖాన్ - ఆర్కా టీమ్ చూపించిన దారిలోనే వెళుతున్నారంతా.

ఇప్పుడు ఇదే బాటను తమిళ హీరో విజయ్ నిర్మాతలు అనుసరిస్తున్నారు. 2017లో రిలీజై సంచలన విజయం సాధించిన `మెర్సల్` చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మెర్సల్ తమిళ వెర్షన్ ప్రపంచదేశాల్లో దాదాపు 200 కోట్లు వసూలు చేస్తే - తెలుగు రాష్ట్రాల్లో `అదిరింది` పేరుతో రిలీజై డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. యూనివర్శల్ అప్పీల్ - కమర్షియ్ హంగులతో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్ చేసేందుకు ఏకంగా `ధూమ్ 3`ని రిలీజ్ చేసిన ప్రఖ్యాత చైనీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్ జీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. `హెల్ బోయ్ 3` లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ని ఈ సంస్థ చైనాలో రిలీజ్ చేసింది. ఇప్పుడు `మెర్సల్` డబ్బింగ్ వెర్షన్ ని చైనాలో రిలీజ్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇలయదళపతి విజయ్ అక్కడ విజయం సాధిస్తే ఆ తర్వాత అతడి సినిమాల కథలన్నీ మారుతాయనడంలో సందేహం లేదు. తమిళనాడు - చైనా - తెలుగు రాష్ట్రాలే కేంద్రకంగా రూట్ ఛేంజ్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్న `సర్కార్`ని విదేశాల్లో భారీగా రిలీజ్ చేసే ఛాన్సుంటుంది.