మ్యాజిక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాడట

Fri Oct 13 2017 09:55:57 GMT+0530 (IST)

తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తెలుగు తెరపై మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజా-రాణి ఫేం అట్లీ డైరెక్షన్ లో విజయ్ తాజాగా మెర్సల్ సినిమా చేశాడు. దీనిని అదిరింది పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. తమిళంతోపాటే తెలుగులోనూ ఈ మూవీ దీపావళికి ముందు థియేటర్లకు రానుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్ - సమంత ఇందులో హీరోయిన్లుగా నటించారు.అదిరింది సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట. అందులో ఒకటి మెజీషియన్ పాత్ర. ఈ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి విజయ్ నిజంగానే మేజిక్ లో కొన్ని ట్రిక్కులు నేర్చుకున్నాడు. పేరున్న మెజీషియన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా గొప్ప మెజీషియన్లుగా పేరు తెచ్చుకున్న వారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. తాను నేర్చుకున్న ట్రిక్కులతో షూటింగ్ టైంలో యూనిట్ మొత్తాన్ని బాగానే మెప్పించాడట. అదిరింది సినిమాను పవన్ కళ్యాణ్ సన్నిహితుడైన శరత్ మరార్  రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మూల కథ అందించింది బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం.  

తెలుగు నేలపై ఇమేజ్ సంపాదించుకోవాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. సినిమాలు యావరేజ్ గా కలెక్షన్లు రాబడుతున్నాయే తప్ప ప్రేక్షకుల్లో పాపులారిటీ మాత్రం రాలేదు. ఒకటి రెండు సినిమాలు బాగా ఆడి మంచి కలెక్షన్లు సంపాదించినా అదంతా డైరెక్టర్ అకౌంట్లో క్రెడిట్ అవుతోంది తప్ప విజయ్ కు ఒరిగిందేం ఉండటం లేదు.  అదిరింది అయినా అతడి ఆశలు నిలబెడుతుందేమో చూద్దాం...