సమ్మెను పట్టించుకోని మురుగదాస్!

Tue Mar 20 2018 16:40:27 GMT+0530 (IST)

టాలీవుడ్లో సమ్మెకు సంఘీభావంగా తమిళ సినీ పరిశ్రమలోనూ ఈ నెల రెండో తారీఖు నుంచి థియేటర్లు మూత పడ్డాయి. ఐతే మనవాళ్లు వారం తిరక్కుండానే జెండా పీకేశారు. సమ్మె విరమించి సినిమాల్ని ఆడనిచ్చేస్తున్నారు. కానీ మనవాళ్లకు మద్దతుగా సమ్మె మొదలుపెట్టిన తమిళ నిర్మాతలు మాత్రం తగ్గలేదు. రెండో వారం కూడా థియేటర్లను మూత వేశారు. మూడో వారానికి సమ్మె మరో స్థాయికి చేరుకుంది. షూటింగులు సహా మొత్తం సినీ పరిశ్రమ కార్యకలాపాలన్నీ ఆపేశారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో చిన్న ఈవెంట్ కూడా జరగట్లేదు. ఆన్ లైన్లో ఫస్ట్ లుక్ లాంచ్ లాంటి కార్యక్రమాలు కూడా ఆపేశారు.డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ధరలు తగ్గించేలా చేయడంతో పాటు మరికొన్ని సమస్యల మీదా తమిళ నిర్మాతలందరూ ఉమ్మడిగా పోరాడుతున్నారు. ఈ పోరాటానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ నేతృత్వం వహిస్తున్నాడు. ఐతే అందరూ ఏకతాటిపై నడుస్తున్న సమయంలో ఒక చిత్ర యూనిట్ మాత్రం రూటు మార్చింది. విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మాత్రం ఆపలేదట. ఓ రహస్య ప్రదేశంలో సైలెంటుగా చిత్రీకరణ కొనసాగిస్తున్నారట. షూటింగ్ ఆపితే తమకు చాలా నష్టం వాటిల్లుతుందని.. పైగా దీపావళి రిలీజ్ డేట్ అందుకోలేమని భావించి.. సమ్మెను పట్టించుకోకుండా షూటింగ్ కానిస్తున్నారట. ఎంత గోప్యత పాటిద్దామనుకున్నప్పటికీ ఈ విషయం బయటికి వచ్చేసింది. దీనిపై నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాల్ ఈ చిత్ర బృందంపై ఎలాంటి చర్యలు చేపడతాడో.. ఆ సినిమా షూటింగ్ ను ఎలా ఆపిస్తాడో చూడాలి.