Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో స్పీచ్ పేలిపోయింది

By:  Tupaki Desk   |   21 Aug 2017 8:24 AM GMT
ఆ స్టార్ హీరో స్పీచ్ పేలిపోయింది
X
ఒక హీరో గురించి మరో హీరో అభిమానులు దుమ్మెత్తిపోయడం.. సోషల్ మీడియాలో దారుణమైన రీతిలో ట్రోలింగ్ చేయడం కోలీవుడ్లో బాగా ఎక్కువ. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్-అజిత్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్ జరుగుతుంటుంది. ఈ మధ్య కాలంలో ఆ హీరోల అభిమానులు మరీ శ్రుతి మించిపోయారు. అజిత్ ను ఏదో అందని అతడి అభిమానులు సింగర్ చిన్మయిని టార్గెట్ చేసుకుంటే... విజయ్ సినిమా మీద కామెంట్ చేసిందని ఒక లేడీ జర్నలిస్టుపై విజయ్ అభిమానులు పడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు హీరోలూ తమ అభిమానులు హద్దుల్లో ఉండాలంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు.

ఇక ఆదివారం రాత్రి తన కొత్త సినిమా ‘మెర్సల్’ ఆడియో వేడుకలోనూ విజయ్ పరోక్షంగా ఈ విషయాల్నే ప్రస్తావించాడు. ఈ మధ్య తననో విషయం వెంటాడుతోందని.. చాలామందితో దీని గురించే చర్చిస్తున్నానని.. దీనిపై వాదనలు కూడా నడుస్తుంటాయని.. మీరు ‘నెగెటివిటీ’ని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతుంటారని.. ఇగ్నోర్ చేయడమే దానికి సరైన మార్గమని తాను అంటుంటానని.. అదే పాటిస్తానని.. దీని వల్ల సమస్యలన్నీ సమసిపోతాయని అన్నాడు. మనల్ని అందరూ ప్రేమించేస్తే.. ఇష్టపడితే లైఫ్ లో కిక్కు ఉండదని.. వ్యతిరేకించే వాళ్లు కూడా ఉన్నపుడే మజా ఉంటుందని.. లైఫ్ జాలీగా వెళ్తుందని.. కాబట్టి మనల్ని విమర్శిస్తున్నారని ఎవరినీ వ్యతిరేకించాల్సిన పని లేదని విజయ్ అభిప్రాయపడ్డాడు. ప్రతి అభిమానినీ వ్యక్తిగత పిలుపుతో పలకరిస్తున్నట్లుగా ‘నన్బా’ (స్నేహితుడా) అనే పదం వాడి.. హద్దులు దాటి ప్రవర్తించొద్దని హితవు పలికాడు విజయ్. ఈ స్పీచ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మామూలుగా తన ఆడియో వేడుకల్లో మైకే అందుకోని విజయ్.. ఈసారి చక్కటి ప్రసంగంతో అందరి మనసులూ గెలిచాడు. సోషల్ మీడియాలో ఈ ప్రసంగం వైరల్ అవుతోంది. తమిళ జనాల్లో దీని గురించే నిన్నట్నుంచి చర్చలు నడుస్తున్నాయి.