Begin typing your search above and press return to search.

‘సైరా’లో అతను విలనా?

By:  Tupaki Desk   |   23 Aug 2017 11:24 AM GMT
‘సైరా’లో అతను విలనా?
X
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో కీలక పాత్రలు పోషించే నటీనటుల వివరాలు మంగళవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతారతో పాటు జగపతిబాబు.. కిచ్చా సుదీప్.. విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలిపారు. ఐతే ఇందులో తెలుగు ప్రేక్షకులకు తక్కువ పరిచయం ఉన్న నటుడంటే విజయ్ సేతుపతినే.

‘పిజ్జా’ సినిమాతో ఇంతకుముందే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ.. అప్పటికి అతను ఛోటా నటుడు. హీరోగా ఒక ఇమేజ్ అంటూ లేదు. కానీ గత నాలుగైదేళ్లలో విజయ్ సేతుపతి రేంజే మారిపోయింది. అద్భుతమైన పాత్రలతో కమల్ హాసన్.. సూర్యల స్థాయి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను ‘సైరా’లో నటించబోతుండటం ఆసక్తి రేకెత్తించే విషయమే. అతను ఎలాంటి పాత్ర చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

విజయ్ సేతుపతి ‘సైరా’లో నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతుండటం విశేషం. బ్రిటిష్ పాలకుల తరఫున పని చేసే భారతీయుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే కీలక పాత్రలో విజయ్ కనిపిస్తాడని అంటున్నారు. విజయ్ హీరో కాకముందే తమిళంలో నెగెటివ్ రోల్సే చేయడం విశేషం. వాటితోనే అతడికి మంచి పేరొచ్చింది. ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ వచ్చాక నెగెటివ్ రోల్ చేస్తున్నాడన్న వార్త.. తమిళ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.