సైరా: మరో పిక్ లీక్ అయ్యిందోచ్..!

Wed Dec 12 2018 11:30:02 GMT+0530 (IST)

మెగాస్టార్ చిరంజీవి తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సైరా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు.  ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన టాలెంటెడ్ నటులు కూడా నటిస్తున్నారు. అందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఒకరు.ఈ సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించిన లుక్ ఒకటి తాజా గా లీక్ అయింది. నలుపు రంగు దుస్తులు ధరించి నుదుటన విభూతి నామాలతో పాటుగా తిలకం కూడా దిద్దుకున్నాడు. పొడవాటి జుట్టు.. మెడలో దండతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.  ఈ సినిమాలో పాత్రధారుల గెటప్పులు లీక్ కాకుండా 'సైరా' టీమ్ ఎంతో జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ ఇలా సేతుపతి లుక్ బయటకు రావడం విశేషమే.  ఈ గెటప్ చూస్తుంటే విజయ్ సేతుపతికి ఏదో పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చి ఉంటారనిపిస్తోంది. ఇప్పటికే విజయ్ సేతుపతి ఎన్నో తమిళ సినిమాలలో తన నటనతో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. 'సైరా' తో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించడం కాబట్టి సేతుపతి కి తెలుగులో ఇంతకంటే గ్రాండ్ ఎంట్రీ ఉండకపోవచ్చు.

ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'సైరా' ను వచ్చే ఏడాది ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉన్నారట. అమితాబ్ బచ్చన్.. జగపతి బాబు.. సుదీప్.. రవికిషన్.. నయనతార.. తమన్నా.. హ్యూమా ఖురేషీ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీత దర్శకుడు.