Begin typing your search above and press return to search.

రజనీకి దగ్గరగా వస్తున్నాడే!

By:  Tupaki Desk   |   8 Nov 2018 5:45 AM GMT
రజనీకి దగ్గరగా వస్తున్నాడే!
X
దక్షిణాదిన దశాబ్దాలుగా సూపర్ స్టార్ రజనీకాంతే నంబర్ వన్. తెలుగులో నాన్-బాహుబలి అంటూ వసూళ్ల రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నట్లే.. హీరోల విషయానికి వచ్చేసరికి దక్షిణాదిన నాన్-రజనీ రికార్డులని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన పాపులారిటీ.. మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ లో మిగతా స్టార్ హీరోల హిట్ సినిమాల వసూళ్ల కంటే రజనీ డిజాస్టర్ల కలెక్షన్లు ఎక్కువగా ఉంటుంటాయి. ఇక రజనీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందంటే వసూళ్ల మోత మోగిపోతుంటుంది. అందుకు ‘శివాజీ’.. ‘రోబో’ లాంటి సినిమాలే రుజువు. తమిళంలో రజనీకి.. మిగతా స్టార్ హీరోలకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉండేది ఒకప్పుడు. కానీ ఈ మధ్య విజయ్ ఆ అంతరాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు. గత దశాబ్ద కాలంలో విజయ్ చాలానే బ్లాక్ బస్టర్లు కొట్టాడు. తుపాకి.. కత్తి.. మెర్శల్ లాంటి సినిమాలు అతడి స్థాయిని ఎంతో పెంచాయి.

తాజాగా ‘సర్కార్’ తో రజనీకి చాలా దగ్గరగా వచ్చేశాడు విజయ్. ఈ చిత్రానికి మరీ గొప్ప టాక్ ఏమీ లేకపోయినా.. వసూళ్ల మోత మామూలుగా లేదు. తొలి రోజు ఈ చిత్రం రూ.37 కోట్ల షేర్.. రూ.67 కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. దక్షిణాదిన నాలుగో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమా ఇది. తొలి మూడు స్థానాల్లో బాహుబలి-2.. బాహుబలి-1.. కబాలి ఉన్నాయి. ‘కబాలి’కి.. దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. తమిళనాట అయితే ‘కబాలి’ వసూళ్లను కూడా దాటేసింది ‘సర్కార్’. రజనీ కొత్త సినిమా ‘కాలా’ కంటే దీని వసూళ్లే ఎక్కువ. ‘కబాలి’ తెలుగులోనూ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం వల్ల కొంచెం ముందంజలో ఉంది. విశేషం ఏంటంటే.. ‘సర్కార్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా తొలి రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ఇక్కడ రూ.3.6 కోట్ల గ్రాస్.. రూ.2.3 కోట్ల షేర్ వచ్చింది. విజయ్ స్థాయికి ఇవి మంచి కలెక్షన్లే.