Begin typing your search above and press return to search.

ఆ తమిళ స్టార్.. మోడీతో పెట్టుకున్నాడు

By:  Tupaki Desk   |   20 Oct 2017 5:24 AM GMT
ఆ తమిళ స్టార్.. మోడీతో పెట్టుకున్నాడు
X
ఇండియాలో రాజకీయాలతో సినీ తారలకు గట్టి అనుబంధం ఉన్న రాష్ట్రమేదంటే మరో మాట లేకుండా తమిళనాడు పేరు చెప్పేయొచ్చు. ఎంజీఆర్.. కరుణానిధి.. జయలలిత.. ఇలాంటి రాజకీయ ఉద్ధండులందరూ సినీ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. వీళ్ల తర్వాతి తరం తారలకు కూడా రాజకీయాలపై బాగానే ఆసక్తి ఉంది. రజినీకాంత్.. కమల్ హాసన్ ఇప్పటికే రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరి తర్వాత పరోక్షంగా రాజకీయ ఆసక్తిని ప్రదర్శిస్తున్న హీరో విజయ్. రజినీ తర్వాత తమిళనాట అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో అయిన విజయ్.. తన సినిమాల ద్వారా తన పొలిటికల్ యాంబిషన్ గురించి చూచాయిగా చెబుతూ ఉంటాడు. ఇంతకుముందు తలైవా (తెలుగులో ‘అన్న’) అనే సినిమాలో పొలిటికల్ టచ్ కనిపించింది. అందులో కొన్ని పొలిటికల్ డైలాగులు వివాదాస్పదమయ్యాయి.

తాజాగా ‘మెర్శల్’ సినిమాలో విజయ్ పేల్చిన పొలిటికల్ డైలాగులు చర్చనీయాంశమవుతున్నాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ.. డిజిటల్ ఇండియా.. డీమానిటైజేషన్ లాంటి వాటిపై విజయ్ ‘మెర్శల్’లో సెటైర్లు వేయడం విశేషం. ఈ డైలాగులు తమిళనాట ప్రకంపనలు రేపాయి. భారతీయ జనతా పార్టీ విజయ్ మీద మండిపడింది. మోడీ చేసిన మంచేంటో అర్థం చేసుకోకుండా విజయ్ అపరిపక్వంగా డైలాగులు పేల్చాడని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విజయ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఐతే తమిళ జనాల నుంచి మాత్రం ఈ డైలాగులకు మంచి స్పందన వస్తోంది. తమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని మోడీ సర్కారు ప్రయత్నించడం.. దీనికి తోడు డీమానిటైజేషన్ - జీఎస్టీ లాంటి పథకాలతో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంపై తమిళ జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఐతే తాను ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఆలోచనలపై విజయ్ ఇలా సెటైర్లు పేల్చిన నేపథ్యంలో మోడీ అతణ్ని ఇబ్బంది పెట్టకుండా ఊరుకుంటాడా అన్నది డౌటు. ఈ విషయం ఆయన దృష్టికి చేరితే మాత్రం విజయ్ కి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంతకుముందు ‘తలైవా’ సినిమా విషయంలో జయలలిత విజయ్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది.