'నోటా' తప్పు మళ్లీ చేయను : దేవరకొండ

Sun Nov 18 2018 07:00:01 GMT+0530 (IST)

‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి సాలిడ్ హిట్స్ తర్వాత విజయ్ దేవరకొండ మూవీ అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి సమయంలో వచ్చిన ‘నోటా’ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చింది. ఆ చిత్రం ఫ్లాప్ అని విజయ్ దేవరకొండ కూడా ఒప్పుకున్నాడు. తాజాగా మరోసారి ఆ చిత్రం గురించి విజయ్ స్పందించాడు. నేడు విజయ్ దేవరకొండ నటించిన ‘ట్యాక్సీవాలా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన దేవరకొండ ‘నోటా’ చిత్రంపై ఎక్కువ శ్రద్ద పెట్టక పోవడం వల్ల ఫ్లాప్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.‘నోటా’ సినిమాను ఒప్పుకున్న సమయంలో చాలా బిజీగా ఉన్నాను. ఒకవైపు గీత గోవిందం మరో వైపు ట్యాక్సీవాలా షూటింగ్స్ తో బిజీగా ఉండటం వ్ల ‘నోటా’ చిత్రంలో ఏం జరుగుతుందో నేను శ్రద్ద పెట్టలేక పోయాను. ఒకేసారి అన్ని చిత్రాలు చేయడం వల్ల జడ్జిమెంట్ కూడా కష్టం అయ్యిందని చెప్పుకొచ్చాడు. ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం వల్ల ఏ ఒక్కదానిపై పూర్తి శ్రద్ద పెట్టలేం అని అందుకే ఇకపై ఆ తప్పు చేయను అన్నాడు.

‘నోటా’ కథలో ఇంటెన్సిటీ లోపించడంతో పాటు స్క్రీన్‌ప్లే విషయంలో కూడా తప్పు జరిగాయని దేవరకొండ ఒప్పుకున్నాడు. మరోసారి నోటా లాంటి తప్పు చేయను అంటూ దేవరకొండ ప్రేక్షకులకు హామీ ఇచ్చాడు. నోటా ఫ్లాప్ అయినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా నోటా వల్ల నష్టపోలేదని దేవరకొండ అన్నాడు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తర్వాత సంవత్సరంకు ఒక్క చిత్రం చొప్పున చేస్తానన్నాడు. హడావుడిగా ఇకపై అస్సలు సినిమాలు చేయనని కూల్ గా ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో అవే సినిమాలు చేస్తానని దేవరకొండ అన్నాడు.