సేవ్ నల్లమల అంటున్న రౌడీ

Thu Sep 12 2019 13:56:24 GMT+0530 (IST)

నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల తవ్వకాలపై ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతానికి భిన్నంగా యురేనియం తవ్వకాలపై వామపక్ష నేతలు.. ఉద్యమనేతలు మాత్రమే కాదు సినీ రంగ ప్రముఖులు కూడా సీన్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలను రక్షించుకోవాలన్న నినాదాన్ని బలంగా వినిపించటమే కాదు.. త్వరలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెడతానని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.యూరేనియం వెలికితీతపై సినీ రంగానికి సంబంధించిన మరో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా సేవ్ నల్లమల క్యాంపెయిన్ ను స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే..యూత్ ను ఇట్టే కనెక్ట్ అయ్యేలా చేసే హీరో విజయ్ దేవరకొండ కూడా సేవ్ నల్లమల క్యాంపెయిన్ లో భాగమయ్యారు. రౌడీ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ యువహీరో సేవ్ నల్లమల క్యాంపెయిన్లో కాస్త ఘాటుగానే స్పందించారు.

తాజాగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన ఆయన.. నల్లమల కారణంగా జరిగే నష్టాన్ని సూటిగా.. ఎలాంటి సుత్తి లేకుండా చెప్పేశారు. 20వేల ఎకరాల నల్లమల అడువులు ప్రమాదంలో పడ్డాయి. ఇప్పటికే చెరువుల్ని నాశనం చేశాం.. కొన్ని రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి.. నిత్యవసర వస్తువుదొరకని పరిస్థితి ఉంది.. ఇప్పుడున్న కొద్దిపాటి అవకాశాల్ని కూడా నాశనం చేస్తున్నామని ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా దట్టమైన నల్లమల అడవుల్ని నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు.  యురేనియం వెలికితీతపైనా తనకున్న ఆగ్రహాన్ని ఆయన వ్యక్తం చేశారు. యురేనియం కావాలంటే కొనొచ్చని.. కానీ.. నల్లమల అడవుల్ని కొనలేం కదా? అంటూ లాజిక్ క్వశ్చన్ ను తెర మీదకు తెచ్చారు.

విద్యుత్ కోసమే యురేనియం అంటే.. దానికి బదులుగా సోలార్ ఎనర్జీ లాంటివి ప్రోత్సహించాలన్న విజయ్ దేవరకొండ.. ప్రతి మేడ మీద సోలార్ ప్యానల్స్ ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. పీల్చే గాలి.. తాగేందుకు నీరు లేనప్పుడు యూరేనియం.. కరెంట్ ఉంటే మాత్రం ఏం చేసుకోగలమన్న రౌడీ మాటల్లో బోలెడంత అర్థం ఉందని చెప్పక తప్పదు.