Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరే నన్ను నిలబెట్టారు..విజయ్ ఉద్వేగం..

By:  Tupaki Desk   |   19 Jun 2018 8:14 AM GMT
ఆ ఇద్దరే నన్ను నిలబెట్టారు..విజయ్ ఉద్వేగం..
X
సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఆ ప్రపంచానికి బానిస అయితే అంత త్వరగా కోలుకోలేరు. సినిమాలపై ప్రేమతో ఎంతో మంది ఉన్న ఊరును వదిలి.. కన్న వారిని వదిలి ఒక్క చాన్స్ అంటూ హైదరాబాద్ కృష్ణ నగర్ వీధుల్లో తిరుగుతుంటారు. కానీ సినిమా అవకాశాలు కొందరికే వచ్చి వారు ప్రయోజకులు అవుతారు. అయితే బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ డం తెచ్చుకున్న వాళ్లు కొందరే.. అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఒకరు.

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ అలాగే ఎదిగాడు.. అంతకుముందు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ - ‘పెళ్లి చూపులు’ లాంటి విజయాలు ఉన్నప్పటికీ.. హీరోగా అతడికి ఇమేజ్ లేదు. కానీ ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది. విపరీతంగా మార్కెట్ పెరిగింది. ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు వచ్చాయి. ఐతే ‘పెళ్లి చూపులు’ చేయడానికి ముందు తన ఎంత దుర్భర స్థితిలో ఉన్నానో తాజాగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

తాను సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదని విజయ్ చెప్పుకొచ్చారు. అనుకోకుండా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా తో ఎంట్రీ ఇచ్చానని.. ఆ సినిమా విజయంతో ఇక్కడ స్థిరపడగలనని నమ్మకం కలిగిందని తెలిపాడు. ఆ సినిమా తర్వాత తనకు వరుసగా అవకాశాలు వస్తాయని భావించానని. కానీ ఏడాది వరకూ ఒక్క సినిమా చాన్స్ రాలేదని తెలిపాడు. ఏడాది ఖాళీగా ఉండడంతో అప్పుడు మానసికంగా చాలా బాధపడ్డానని విజయ్ తెలిపాడు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నిర్మాతలైన స్వప్న - ప్రియాంకలను గైడెన్స్ అడిగానని తెలిపాడు. వాళ్లసాయంతోనే తనకు ‘పెళ్లి చూపులు’ అవకాశం వచ్చిందని.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ విషయంలోనూ వాళ్లే సాయం చేశారని విజయ్ వెల్లడించారు.

ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు తీసుకోవడం తనకు చాలా సంతృప్తినిచ్చిందని.. చిరంజీవి - వెంకటేష్ - బాలక్రిష్ణ లాంటి పెద్ద హీరోలతో కలిసి తాను నామినేట్ అయ్యి ఫిలింఫేర్ అవార్డు అందుకుంటుంటే తనకు మాటలు రాలేదని విజయ్ ఉద్వేగంతో తెలిపాడు.