Begin typing your search above and press return to search.

దేవరకొండ ప్రేక్షకులకు మంచి చేసినట్లేగా..

By:  Tupaki Desk   |   18 March 2018 7:32 AM GMT
దేవరకొండ ప్రేక్షకులకు మంచి చేసినట్లేగా..
X
ఈ తరం కథానాయకుల్లో విజయ్ దేవరకొండది భిన్నమైన దారి. తెరమీదే కాదు.. బయట కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంటాడతను. హిపోక్రసీకి అసలేమాత్రం చోటివ్వకుండా చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాడతను. ‘పెళ్ళిచూపులు’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అతడి నుంచి వచ్చిన ‘ద్వారక’ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం విడుదలైన రెండో రోజుకో మూడో రోజుకో సక్సెస్ మీట్ పెడితే.. ‘మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమించండి’ అంటూ ఆ వేదిక మీదే వ్యాఖ్యానించి పెద్ద షాకిచ్చాడు విజయ్. ఇలా ఇప్పటిదాకా ఏ హీరో మాట్లాడి ఉండడేమో. ఎంత చెత్త సినిమా చేసినా ఆహా ఓహో అంటూ ఊదరగొట్టేస్తుంటుంది ఆ చిత్ర బృందం. విజయ్ లాగా మాట్లాడేవాళ్లు అరుదు.

ఐతే మున్ముందు విజయ్ ఎలా ఉంటాడో చూద్దామని అప్పట్లో కొందరన్నారు. కానీ విజయ్ ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. మొన్న అతను నటించి మరుగున పడి ఉన్న ‘ఏ మంత్రం వేసావె’ ఉన్నట్లుండి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం గురించి ఒక్క మాట మాట్లాడలేదు విజయ్. దీని ప్రమోషన్లకు రాలేదు. సోషల్ మీడియాలోనూ ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. ఈ విషయమై విజయ్‌ ను కొందరు విమర్శించారు కూడా. తనతో సినిమా తీసిన నిర్మాత కోసం ప్రమోషన్లకు రావాలి కదా అని పాయింట్ తీశారు. ఐతే ఒక సినిమా బాగా లేదని తెలిసినపుడు దాన్ని చూడమని జనాలకు చెప్పడం న్యాయమేనా అన్నది కూడా ఆలోచించాలి. విజయ్ అందుకే ఆ సినిమా గురించి ప్రమోట్ చేయలేదన్నది అతడి సన్నిహితుల మాట. అతను సినిమా చూడమని జనాలకు చెప్పి ఉంటే వాళ్లను మోసం చేసినట్లే అని.. అందుకే ‘ద్వారక’ విషయంలో ఎలా నిజాయితీగా ఉన్నాడో.. ‘ఏ మంత్రం వేసావె’ విషయంలో మౌనంగా ఉండి తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పాడన్నది వాళ్ల వాదన. ఈ లాజిక్‌ లో న్యాయం ఉంది కదా?