రౌడీ విజయ్ గ్యాంగ్ పెరుగుతోంది!

Tue Jun 25 2019 11:19:58 GMT+0530 (IST)

ఇండస్ట్రీలో మోరల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సినీనేపథ్యం లేకపోతే అది ఇంకా అవసరం. మంచి స్నేహాలు.. అభిమానమే  ఇక్కడ నిలబెడతాయి. ఇవన్నీ మెయింటెయిన్ చేసే వాళ్లకు కెరీర్ పరంగా డోఖా ఉండదు. ఈ విషయంలో రౌడీ దేవరకొండ ఓ ఆకు ఎక్కువే తిన్నాడని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్. ఒక్కడుగా వచ్చి సమూహంగా మారడం అనేది అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సాధ్యమైంది. దాన్ని మళ్లీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిపీట్ చేస్తున్నాడు. తొలి సినిమా `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్`తో ఒంటరిగా - ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్న పాత్రతో ప్రయాణం మొదలుపెట్టిన రౌడీ విజయ్ దేవరకొండ తన పేరునే బ్రాండ్ గా మార్చుకుని పది మందికి అండగా నిలబడే స్థాయికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగించకుండా ఉండదు. చిరుకు అల్లు రామలింగయ్య అండగా నిలిచినా స్వయంకృషితో ఎదిగేందుకు ఎంతో శ్రమించారు. అదే స్ఫూర్తితో విజయ్ దూసుకెళుతున్నాడు. ఇక్కడ తనకు ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు.  ఎలాంటి సపోర్ట్ లేదు. టాలెంటే అతని సపోర్ట్. మేనమామ యష్ రంగినేని సపోర్ట్ కొంతవరకూ మాత్రమే.ఇక హార్డ్ వర్క్ లోనూ విజయ్ కి చిరుతో సారూప్యత కనిపిస్తోందన్నది ఓ విశ్లేషణ. మెగాస్టార్ స్వయంకృషితో పైకిరావడం అప్పట్లో మెజారిటీ యూత్ ని ఆకట్టుకుంది. ఆయన స్టైల్ - మేనరిజమ్స్.. తనదైన మార్కు డ్యాన్స్.. ఫైట్స్‌తో అప్పటి యూత్ కి ఐకాన్ గా మారిపోయారు. దాంతో ఆయనని స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది ఇండస్ట్రీ బాటపట్టారు. అలా ఆ తరువాత రోజుల్లో ఇండస్ట్రీలో చిరంజీవి కంటూ భారీ గ్యాంగ్ తయారైంది. ఇప్పడు అదే వాతావరణాన్ని తన చుట్టూ క్రియేటర్ చేసుకుంటున్నారు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. `అర్జున్ రెడ్డి` సినిమాతో తనలో నటప్రతిభను నిరూపించుకున్న విజయ్ ఆ తరువాత నుంచి వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ రౌడీ బ్రాండ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు.

ఇదే క్రమంలో టాలీవుడ్ లో చిరు తరహాలో తన గ్యాంగ్ ని పెంచుకుంటుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలో సోదరుడు ఆనంద్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. సొంత బ్యానర్ పెట్టి సినిమాలు.. వెబ్ సిరీస్ లు అంటూ ప్రయోగాలు చేయనున్నాడు. అలాగే తనకోసం ఓ గ్యాంగ్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. రాహుల్ రామకృష్ణ- ప్రియదర్శి- తరుణ్ భాస్కర్- సందీప్ రెడ్డి వంగా- భరత్ కమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే విజయ్ వెంట ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` హీరోతో పాటు టీమ్ కూడా చేరిపోయింది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నవీన్ పొలిశెట్టి.. విజయ్ ఇద్దరూ హైదరాబాద్ `సూత్రధార్`లో థియేటర్ ఆర్ట్స్ స్టడీ చేశారు. అక్కడ మొదలైన వీరి పరిచయం  మంచి స్నేహంగా మారి ఒకరికి ఒకరు మోరల్ సపోర్టుగా నిలుస్తున్నారు. ఇక మీదట కూడా ఇలాగే తనకు నచ్చిన తనవారిని ప్రమోట్ చేసుకుంటూ తన గ్యాంగ్ ని ఇండస్ట్రీలో మరింతగా విస్తరించాలనుకుంటున్నాడట. విజయ్ ప్రస్థానాన్ని గమనిస్తున్న వాళ్లంతా ఎలాంటి సినీనేపథ్యం లేకుండా ఈ తరహా యాక్టివిటీస్ చేయడం గొప్పే కదా! అని ప్రశంసిస్తున్నారు.