కాకినాడలో కామ్రేడ్ సందడి!

Fri Aug 10 2018 18:51:56 GMT+0530 (IST)

అర్జున్ రెడ్డి తర్వాత సోలో హీరోగా సుమారు ఏడాది గ్యాప్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇకపై వరస సినిమాలతో ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాడు. ఆగస్ట్ 15న విడుదల కాబోతున్న గీత గోవిందంతో సందడి మొదలుపెట్టనున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత టాక్సీ వాలాతో హల్ చల్ చేస్తాడు. దాని తాలూకు అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ద్విభాషా చిత్రం నోటా షూటింగ్ కూడా మంచి స్వింగ్ లో ఉంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న ఆ మూవీలో విజయ్ సీఎంగా నటిస్తున్నాడనే గాసిప్ జోరుగా ప్రచారంలో ఉంది. వీటితో పాటు డియర్ కామ్రేడ్ అనే మరో సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ తో బిగ్ బెన్ సినిమా టై అప్ అయ్యి తీస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాకినాడలో జరుగుతోంది. క్లైమాక్స్ షూట్ చేస్తునట్టుగా సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ తన సినిమాల్లో రెగ్యులర్ గా వాడే తెలంగాణ స్లాంగ్ కి పూర్తి భిన్నంగా కాకినాడ యాసతో అలరించబోతున్నట్టు తెలిసింది.డియర్ కామ్రేడ్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే దాని గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి ఉంది. దర్శకుడి వెర్షన్ ప్రకారం ఇందులో హీరో కుటుంబం కమ్యూనిస్టులది ఉంటుంది. ఆదర్శ భావాలు కలిగిన ఆవేశపూరిత విద్యార్ధి నాయకుడిగా విజయ్ దేవరకొండ పాత్రలో మంచి ఫైర్ ఉంటుందట. లవ్ స్టోరీ ని చూపిస్తూనే  మరోవైపు సోషల్ మెసేజ్ ని మిక్స్ చేసే తీరు కొత్తగా అనిపిస్తుందని దర్శకుడు హామీ ఇస్తున్నాడు. గీత గోవిందంలో విజయ్ దేవరకొండకు మంచి జోడిగా సెట్ అయిన రష్మిక మండన్న మరోసారి జట్టు కడుతోంది. ఇప్పుడు జరుగుతున్న కాకినాడ షెడ్యూల్ లో తను కూడా ఉందట. మొత్తానికి క్యూలో ఒకదానికి ఒకటి సంబంధం లేని సినిమాలను లైన్ పెట్టిన విజయ్ దేవరకొండను చూస్తుంటే ఒక ఫార్ములా కట్టుబడి ఉండేలా కనిపించడం లేదు. వచ్చే ఆరు నెలల కాలంలోనే మొత్తం నాలుగు సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలా చూసుకున్నా వేగంగా సినిమాలు చేస్తున్న క్రేజీ యూత్ హీరోగా విజయ్ దేవరకొండ అకౌంట్ లో మరో క్రెడిట్ పడిపోతుంది. డియర్ కామ్రేడ్ విడుదల వచ్చే ఏడాది సమ్మర్ లోపే విడుదల చేసే దిశగా యూనిట్ ప్లానింగ్ లో ఉంది. అది మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లను బట్టి త్వరలో నిర్ణయిస్తారు.