Begin typing your search above and press return to search.

ఇక్కడే కాదు.. అక్కడా జీరోనే

By:  Tupaki Desk   |   21 Nov 2018 1:30 AM GMT
ఇక్కడే కాదు.. అక్కడా జీరోనే
X
బిచ్చగాడు’ అనే సినిమా టైటిల్ చూసి.. ఇదేం పేరు.. ఇదేం సినిమా అంటూ ఎగతాళిగా మాట్లాడారు టాలీవుడ్ జనాలు. కానీ ఆ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’నే దెబ్బ కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలన వసూళ్లతో ప్రకంపనలు రేపింది. ఏకంగా రూ.25 కోట్లకు పైగా షేర్ రాబట్టి అబ్బుర పరిచింది. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులారిటీ సంపాదించాడు విజయ్ ఆంటోని. స్వతహాగా సంగీత దర్శకుడైన అతను.. అప్పటికే తమిళంలో రెండు సినిమాలు చేసినప్పటికీ ‘బిచ్చగాడు’తోనే తెలుగులో పేరు తెచ్చుకున్నాడు. ఈ ఊపులో ఆ తర్వాత వరుసబెట్టి తెలుగులో సినిమాలు వదిలాడు. ‘బిచ్చగాడు’ తర్వాత వచ్చిన విజయ్ చిత్రం ‘బేతాళుడు’కు ఆశ్చర్యకర ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఏం లాభం.. సినిమా నిలబడలేదు. ఐతే ఆ సినిమా వరకు చూస్తే విజయ్‌ కి అభిరుచి ఉన్నట్లే కనిపించింది.

కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ విజయ్ పేరును బాగా దెబ్బ తీసేశాయి. ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా కింద పడ్డాడతను. ఈ మధ్య విజయ్ ఆంటోనీ సినిమా రిలీజవుతుంటే పట్టించుకునే పరిస్థితే లేదు. ఇటీవలే విజయ్ నుంచి ‘రోషగాడు’ అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం విడుదలైనట్లు కూడా జనాలకు తెలియదు. సినిమా కూడా చెత్తగా ఉండటంతో అడ్రస్ లేకుండా పోయింది. విజయ్‌ కి తెలుగులో మాత్రమే ఈ పరిస్థితి ఉందేమో అనుకుంటే పొరబాటే. తమిళంలోనూ అతడి సినిమాలు ఆడట్లేదు. ఇంతకుముందున్న క్రెడిబిలిటీ మొత్తం పోగొట్టుకున్నాడతను. మొదట్లో వచ్చిన పేరును వాడుకునే క్రమంలో ముందు వెనుక చూడకుండా ఆదరా బాదరా సినిమాలు చేసి కెరీర్‌ ను దెబ్బ తీసుకున్నాడు. ‘రోషగాడు’ తమిళ వెర్షన్ కూడా డిజాస్టర్ అయింది. తమిళనాట కూడా మార్కెట్ మొత్తం దెబ్బ తీసుకుని జీరో అయిపోయాడు విజయ్.