పాపం బిచ్చగాడు హీరో..

Thu May 17 2018 23:00:01 GMT+0530 (IST)

తమిళంలో అనుకోకుండా హీరోగా మారాడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ. అతడి సినిమాలు వరుసగా విజయవంతం కావడంతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఐతే విజయ్ కెరీర్ ను గొప్ప మలుపు తిప్పిన సినిమా ‘పిచ్చకారన్’. తమిళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో రిలీజై సంచలన విజయం సాధించింది. అసలేమాత్రం అంచనాల్లేకుండా విడుదలై ఏకంగా రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సినిమా విజయ్ కి తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ ప్రభావం విజయ్ తర్వాతి సినిమా ‘బేతాళుడు’ విషయంలో బాగా కనిపించింది. సూర్య.. కార్తి లాంటి తమిళ హీరోల సినిమాలు తెలుగులో ఎంత క్రేజ్ తో విడుదలవుతాయో.. ఇదీ అలాగే రిలీజైంది. కానీ అంచనాల్ని అందుకోవడంలో విఫలమై ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ‘యమన్’.. ‘ఇంద్రసేన’ సినిమాలూ నిరాశపరిచాయి.‘ఇంద్రసేన’తో విజయ్ మీద తెలుగు ప్రేక్షకులు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. అప్పటిదాకా అతడి సినిమాల్లో ఏదో ఉంటుందన్న భరోసా ఉండేది. వరుసగా మూడు ఫ్లాపులిచ్చేసరికి అతడికి దండం పెట్టేశారు. విజయ్ కొత్త సినిమా ‘కాశి’ గురించి పట్టించుకునే వాళ్లే కనిపించడం లేదు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ముందే సినిమా నుంచి తొలి ఏడు నిమిషాల సన్నివేశాల్ని చూపించి ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు. అది బాగున్నప్పటికీ జనాల్లో స్పందన కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘మహానటి’ మీదే ఉంది. దీన్నుంచి బయటికి వచ్చి విజయ్ సినిమా చూస్తారా అన్నది సందేహమే. పాపం.. మూడేళ్ల కిందట ఇదే సమయానికి ‘బిచ్చగాడు’ తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సాగిస్తూ ఉంది. కానీ ఇప్పుడు విజయ్ ఆంటోనీని పట్టించుకునేవాడు లేడు. వచ్చిన ఫాలోయింగ్ ను నిలబెట్టుకోలేకపోవడం అతడి స్వయంకృతం అనే చెప్పాలి.