Begin typing your search above and press return to search.

పోలీస్ బిచ్చగాడు మెప్పిస్తాడా?

By:  Tupaki Desk   |   13 Aug 2018 6:55 AM GMT
పోలీస్ బిచ్చగాడు మెప్పిస్తాడా?
X
ఒక్క సినిమా జాతకాన్ని మార్చేస్తుంది అనే ఉపమానం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. దానికో మంచి ఉదాహరణగా నిలిచాడు విజయ్ ఆంటోనీ. జీరో అంచనాలతో విడుదలై అనూహ్యంగా 25 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి స్టార్ హీరోలకు సైతం సవాల్ విసిరిన బిచ్చగాడు దెబ్బకు విజయ్ ఆంటోనీ పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆ ముచ్చట దానికే పరిమితమవుతుందని పాపం విజయ్ ఊహించి ఉండడు. ఆ తర్వాత చేసినవేవి అంతగా మెప్పించలేకపోయాయి. భేతాళుడు-యమన్-ఇంద్రసేన-కాశి ఇలా ఒకదానికి మించి దారుణ పరాజయాలు విజయ్ ఆంటోనీ మార్కెట్ ని బాగా దెబ్బ తీశాయి. ఇటీవల వచ్చిన కాశికి కనీస ఓపెనింగ్స్ కూడా రాక కొన్నవాళ్లకు నష్టాలు మిగిల్చాయి. అర్జెంటుగా మరో హిట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన తరుణం విజయ్ ఆంటోనీ చేసిన కొత్త మూవీ రోషగాడు. తమిళ్ లో తిమురు పుడిచవన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకుడు గణేషా.

పోలీస్ ఆఫీసర్ గా రఫ్ గా కనిపించే కుమార స్వామి అనే పాత్రలో కనిపిస్తున్న విజయ్ ఆంటోనీ దీంతో పెద్ద బ్రేక్ అందుకోవాలని ఆశిస్తున్నాడు. రోషగాడు టైటిల్ కు ఓ నేపధ్యం ఉంది. ఇది చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో చేసిన సూపర్ హిట్ మూవీ టైటిల్. ఇంద్రసేన పేరుతో ఇలాగే మెగా ఫాన్స్ ను ఆకర్షించాలని ట్రై చేసి ఫెయిల్ అయిన విజయ్ ఆంటోనీ మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కోలీవుడ్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో బలమైన ముద్ర వేసిన విక్రమ్-సూర్య-కమల్ హాసన్ లను మరిపించే స్థాయిలో విజయ్ ఆంటోనీ మెప్పించగలడా అనే దాని మీదే రోషగాడు సక్సెస్ ఆధారపడి ఉంది. శ్రీవిష్ణుతో మెంటల్ మదితో పాటు జయం రవి సరసన టిక్ టిక్ టిక్ లో నటించిన నివేతా పేతురాజ్ ఇందులో హీరోయిన్. ఎప్పటి లాగే విజయ్ ఆంటోనీనే స్వయంగా సంగీతం అందిస్తూ నిర్మిస్తున్న ఈ రోషగాడు క్లిక్ అయితేనే మార్కెట్ కాస్తయినా పుంజుకుంటుంది. అది పోలీస్ ఆఫీసర్ గా కొత్త అవతారంలో విజయ్ ఎలా మాస్ ని అలరిస్తాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. విడుదల ఇంకా ఖరారు కానీ రోషగాడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది.