Begin typing your search above and press return to search.

కంగనను రఫ్ఫాడుకున్న విద్యా

By:  Tupaki Desk   |   29 May 2017 10:44 AM GMT
కంగనను రఫ్ఫాడుకున్న విద్యా
X
కంగనా రనౌత్ పేరెత్తగానే కాంట్రవర్శీలు గుర్తుకొస్తాయి. గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ.. దాంతో పాటు కావాల్సినన్ని వివాదాల్ని కూడా వెంటేసుకుంది ఈ రింగు జుట్టు సుందరి. అవతల ఉన్నది ఎంతటి వారైనా.. అదేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం కంగనాకు అలవాటు. అందుకే ఆమె నోటికి అందరూ భయపడుతుంటారు. కానీ ఎఫ్పుడూ అవతలి వాళ్లను టార్గెట్ చేసే కంగనా.. ఇప్పుడు తనే టార్గెట్ అయిపోతుండటం విశేషం. ఇటీవల ఓ రచయిత.. మరో దర్శకుడు కంగనాను టార్గెట్ చేశారు. కంగనా రనౌత్ కొత్త సినిమా ‘సిమ్రన్’కు స్క్రిప్టు అందించింది తానైతే.. అడిషనల్ స్క్రీన్ ప్లే పేరుతో క్రెడిట్ తను తీసుకుందంటూ అపూర్వ అస్రాని ఆరోపించడం తెలిసిందే. దీంతో పాటు ‘మణికర్ణిక’ సినిమాను తాను తీయాలనుకుంటే.. దాన్ని క్రిష్ చేతికి అప్పగించేసిందంటూ దర్శకుడు కేతన్ మెహతా ఆమెపై విమర్శలు గుప్పించాడు.

ఈ నేపథ్యంలో కంగనాను లక్ష్యంగా చేసుకుని మరో టాప్ హీరోయిన్ విద్యాబాలన్ సోషల్ మీడియాలో సెటైర్లు గుప్పించడం విశేషం. ఆమె తాజాగా ఇన్ స్టా గ్రాంలో తన కొత్త క్రెడిట్ కార్టు ఫొటో పెట్టి ‘‘దర్శకుడు ఇలా క్రెడిట్ కార్డు కానుకగా ఇస్తే.. ఇంకా ‘క్రెడిట్’ ఎవరికి కావాలండీ.. థ్యాంక్యూ సురేష్ త్రివేణి’’ అని పేర్కొంది. సురేష్ త్రివేణి.. విద్యా నటిస్తున్న కొత్త సినిమా ‘యువర్ సులూ’ దర్శకుడు. ఈ చిత్ర నిర్మాత దీనిపై స్పందిస్తూ.. ‘‘విద్యా అదనపు క్రెడిట్ అడక్కముందే ఆమెకు దర్శకుడు క్రెడిట్ కార్డు ఇచ్చేశాడు’’ అని వ్యాఖ్యానించాడు. ఇంతలో ‘సిమ్రన్’ రచయిత అపూర్వ కూడా లైన్లోకి వచ్చాడు. ‘‘అదనపు క్రెడిట్ కోసం డిమాండ్ చేయకముందే.. నిర్మాత ఇచ్చేశాడు. హిలేరియస్’’ అని వ్యాఖ్యానించాడు. తాను కంగనా లాగా రచయితలు.. దర్శకుల నుంచి క్రెడిట్ లాగేసుకోవట్లేదని దెప్పిపొడవడానికే విద్యా ఈ వ్యాఖ్యలు చేసిందని భావిస్తున్నారు. అపూర్వ కూడా జోక్యం చేసుకునే సరికి వీళ్లందరి టార్గెట్ కంగనానే అని తేలిపోయింది. మరి దీనిపై ఫైర్ బ్రాండ్ కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/